ఖాయం చేసుకోండి.. రాజధాని అదే!

ఖాయం చేసుకోండి.. రాజధాని అదే!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్న విషయంలో ఇక ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరు స్వాగతించినా, ఎవరు వ్యతిరేకించినా.. రాజధాని గుంటూరు- విజయవాడ మధ్యేనన్నది స్పష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్నే రాజధాని చేయాలనుకుంటోంది. ఈ మేరకు రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీకి అధికారికంగా తన అభిప్రాయాన్ని కూడా చెప్పింది.

శివరామకృష్ణన్‌ కమిటీతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు సమావేశం సాగిన అనంతరం బయటికి వచ్చి మీడియాతో మట్లాడిన నారాయణ.. రాజధానిగా గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతమే అనువని ప్రభుత్వం తరఫున అభిప్రాయం చెప్పినట్లు వెల్లడించారు. కమిటీ అభిప్రాయం కూడా ఇదే అయి ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. అది వాస్తవమైనా కాకున్నా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కాదని.. కేంద్రం మరో రాజధానిని ఎంపిక చేసే అవకాశాలు లేనట్లే.

శివరామకృష్ణన్‌ కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26న కలుస్తారని.. వారికి సమర్పించాల్సిన ముసాయిదా నివేదిక కూడా సిద్ధమని నారాయణ తెలిపారు. రాజధానికి సుమారు 20 వేల ఎకరాల భూమి అవసరమని.. రాబోయే మూడు నెలల్లో ఆ భూమి సేకరిస్తామని కూడా చెప్పారు. భూసేకరణ కూడా జరిగిపోతోందంటే ఇంకా రాజధాని ఏదనే విషయంలో సందిగ్ధత అవసరమా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు