వావ్.. తెలంగాణలో ఒకే రోజు అన్ని టెస్టులా?

దేశంలోనే అత్యల్పంగా కరోనా పరీక్షలు చేసిన, చేస్తున్న రాష్ట్రంగా గత నెల వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది తెలంగాణ. ఓవైపు పక్కన్న ఆంధ్రప్రదేశ్‌లో లక్షలకు లక్షలు టెస్టులు చేస్తుంటే.. అందులో పదో శాతం టెస్టులతో తెలంగాణ బాగా వెనుకబడిపోయింది.

పరీక్షలు చేయకుండా కరోనాను నియంత్రించడం చాలా కష్టమని.. ఎవరెంతగా మొత్తుకున్నా ప్రభుత్వం పెద్దంగా స్పందించినట్లు కనిపించలేదు. హైకోర్టు జోక్యం చేసుకున్నా టెస్టుల సంఖ్య పెరగలేదు. ఐతే ఉన్నత న్యాయస్థానం మరోసారి సీరియస్ కావడం, జనాల్లో కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. టెస్టుల సంఖ్య పెరిగింది. గత రెండు వారాల్లో టెస్టుల సంఖ్య అనూహ్యంగా పెంచారు. మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినా.. కోర్టు జోక్యంతో మళ్లీ పరీక్షలు ఊపందుకున్నాయి.

ఒకప్పుడు రోజుకు వెయ్యి టెస్టులు చేయడమే గగనంగా ఉండగా.. ఇప్పుడు ఒకే రోజు పదివేలకు పైగా పరీక్షలు చేసే స్థాయికి చేరడం విశేషం. తెలంగాణలో ఇప్పటిదాకా ఏ రోజూ లేని విధంగా శుక్రవారం 10,354 కరోనా పరీక్షలు చేశారు. ఇది ఇప్పటిదాకా రికార్డు. అందులో 1278 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోని కేసులు 762 కాగా.. వివిధ జిల్లాల్లో 500కు పైనే కేసులు నమోదయ్యాయి. మొత్తం పరీక్షల్లో 13 శాతం లోపే పాజిటివ్ కేసులుండటం ఊరటనిచ్చే విషయమే కానీ.. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.

ఇప్పటిదాకా మొత్తం కేసుల్లో హైదరాబాద్‌లోనే దగ్గర దగ్గర 90 శాతం మధ్య ఉండేవి. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పెద్దగా విస్తరించనట్లే కనిపించేది. కానీ తాజా గణాంకాల్ని బట్టి చూస్తే జిల్లాల్లో కరోనా విజృంభిస్తోందని స్పష్టమవుతోంది. మరోవైపు ఒకేసారి 10 వేలకు పైగా టెస్టులంటే తెలంగాణలో కూడా ఏపీలో మాదిరి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.