జగన్ నవ్వు వెనుక మర్మం

జగన్ నవ్వు వెనుక మర్మం

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోర్టు గడప ఎక్కేసరికే మొహం ముడుచుకుపోయింది. ముభావంగా మారిపోయారు. ముఖంలో నవ్వు మాటే లేదు. ఎవరైనా పలకరించినా ముక్తసరిగా వ్యవహరించారు. జగన్ నవ్వుతూ అభివాదం చేసినా.. చేవెళ్ల చెల్లెమ్మ స్పందించింది అంతంతమాత్రమే. కోర్టు గడప తొక్కేసరికే ఇంత ప్రభావం చూపితే.. ఏడాదిగా జైల్లో ఉన్న జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం చాలామందికి అర్థం కాదు. దానికి తోడు జైలు బయటకు వచ్చిన క్షణం నుంచి ముఖం మీద నవ్వు చెదరదు. రెండు చేతులతో చేసే నమస్కారాలకు అస్సలు తెరిపి ఉండదు. జగన్ అలా ఎలా నవ్వగలుగుతాడో అర్థం కాక సామన్య జనం సంగతి తరువాత.. తురుంఖాన్ లాంటి రాజకీయ నేతలకు సైతం బోధపడక తికమక పడిపోతుంటారు. అంత గుండెధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది.. ఒకపక్క జైల్లో పడి ఉంటే బిక్కచచ్చినట్లు ఉంటారు. అలాంటిది మనిషి కాస్త రంగు రావటమే కాదు.. బుగ్గలు కూడా వచ్చాయి. కాస్త ఒళ్లు చేశాడు కూడా. ఇదెలా సాధ్యమన్నది అందరి మనసుల్లో రేగుతున్న ప్రశ్న.

దీనికి వైకాపాకు చెందిన ఓ పెద్దమనిషిని ఇదేంటన్నా... అని విషయం ఆయన దగ్గర ప్రస్తావించినప్పుడు అసలు విషయం చెప్పుకొచ్చారు. చూడండి.. ‘‘జగన్ బయటకు వచ్చినప్పుడు తల్లి విజయమ్మ భోరుమన్నారు. ఆయన్ని పట్టుకొని వదల్లేదు. భార్య భారతి సైతం ఎలా చెలరేగిపోయారో చూశారు. కానీ.. వీరికి భిన్నంగా జగన్ కనిపిస్తారు. కూల్ గా ఉంటాడు. నవ్వు చెదరనీయడు. ఎందుకంటే.. ఆయనకు బాగా తెలుసు... తను ఏ మాత్రం జారిపోయినట్లు కనిపించినా తాను నమ్ముకున్న వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. జైలు జీవితం నన్నేమీ మార్చలేదు. నేనేమీ మారలేదని చెప్పటమే జగన్ ఉద్దేశ్యం. దాదాపు ఆర్నెల్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన తన హావభావాల్లో కానీ.. మ్యానరిజమ్స్ లో కానీ మార్పు కనిపిస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఆయన అలా జాగ్రత్తగా వ్యవహరించారు. నిజానికి ఆయన్ను కోర్టుకు తీసుకురావటం కన్నా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపర్చినట్లు చూపిద్దామనుకన్నారు. దానిపై నిర్ణయం తీసుకునే సమయంలో ఆయనెంత టెన్షన్ పడిపోయారో మాకు తెలుసు. తన ధీమాగా ఉన్నానని...  తప్పులేమీ చేయనప్పుడు మాత్రమే అంత గుండెనిబ్బరంతో ఉంటారని చెప్పటమే జగన్ ఉద్దేశ్యం’’ అని విశ్లేషించారు. మొత్తానికి జగన్ మంచి యాక్టర్ కూడా అన్నమాట. అయినా లోగుట్టు మనకేం తెలుసు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English