ఒక్క స్టోరీ .. ఏపీ రియల్టర్లలో ప్రకంపనలు

ఒక్క స్టోరీ ..  ఏపీ రియల్టర్లలో ప్రకంపనలు

తెలంగాణ ఉద్యమం 2009లో తీవ్రం అయ్యేనాటికే కృష్ణా, గుంటూరు గోదావరి జిల్లాల్లో భూములు రేట్లు బాగా పెరిగిపోయాయి. ఇక యూపీఏ ప్రభుత్వం సీడబ్లూసీ నిర్ణయం అనంతరం సమైక్యాంధ్ర ఉద్యమం ఎంత పెద్దపెట్టున లేచినా రియల్ వ్యాపారం తగ్గకపోగా ఇంకా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విశృంఖలంగా జరిగింది.
కొన్నేళ్లుగా తెలంగాణ ముప్పును గ్రహించిన పలువురు సీమాంధ్రలో రియల్ వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించారు. సేవా రంగం ఉపాధి అవకాశాలు పెరిగి ఉద్యోగాలు, జీతాలు పెరగడంతో ధన ప్రవాహం బాగా పెరిగింది. దీంతో చాలామందికి ఆ డబ్బులు పొదుపు చేయడానికి భూమి కొనుగోళ్లే ప్రధాన కారణం అనుకున్నారు. ఎందుకంటే మిగతా ఎక్కడైనా రిస్కు ఉంటుంది. కానీ భూమి కొంటే ఏనాటికైనా పెరుగుతుందన్న భరోసా మాత్రమే. ఇది ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఎన్నారైలు ఉండే జిల్లాలు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో మరింతగా విస్తరించింది.
 
రాష్ట్రంలో విభజన నిర్ణయం అనంతరం వేగంగా పెరుగుతూ వచ్చిన భూముల ధరలు సీమాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందుకోలేనంత స్థాయికి వెళ్లాయి. రాజధాని ఎక్కడ పెట్టినా విజయవాడ వాణిజ్య రాజధాని అవుతుందన్న కారణంతో ఆ నగరానికి అటూ ఇటు రేట్లు బాగా పెరిగాయి. పెట్రో కారిడార్ తదితర కారణాలతో గోదావరి జిల్లాల్లో విపరీతంగా పెరిగాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని అని స్వయంగా ప్రకటించడంతో అక్కడి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే గ్లోబల్ సిటీగా ఉన్న బెంగుళూరు, హైదరాబాదు నగరాలకంటే కూడా విజయవాడలోనే ధరలు ఎక్కు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వంలో కోట్లకు పడగలెత్తని అధికారులు, అక్రమార్కులు విజయవాడ చుట్టుపక్కల ఎకరకాలకు ఎకరాలు భూమిని కొనిపడేశారు. ఎన్నారైలయితే తమ డబ్బంతా అక్కడే గుమ్మరించారు.
 
అయితే, వీరందరికీ ఓ ఆంగ్ల పత్రిక భారీ షాక్ ఇచ్చింది. ఆ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం అమరావతి రాజధానిగా ఉంటుందని వార్తలొచ్చాయి. రాష్ట్రానికి మధ్యన ఉండటం, భూమి కొరత లేకపోవడం, నీటి వనరుల ఏర్పాటు సదుపాయం ఉండటం, చారిత్రక నేపథ్యం వంటి కారణాలతో పాటు చంద్రబాబు కూడా అటే మొగ్గుచూపుతున్నాడన్నది ఆ వార్త సారాంశం. ఈ ఒక్క వార్తతో నాలుగు రోజుల నుంచి విజయవాడకు అటు ప.గోదావరి, ఇటు మంగళగిరి ప్రాంతాల్లో రియల్ రిజిస్ట్రేషన్లన్నీ ఆగిపోయాయి. ఇన్నిన్ని కోట్లు పోసి కొనుక్కున్న తాము ఏమై పోవాలని వారంతా నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.

కొసమెరుపు: ఇంతకుముందు ఒంగోలు కేంద్రంగా ఇలాంటి వ్యాపారమే జరిగి చాలామంది మునిగిపోయారు. ఇపుడు విజయవాడ కేంద్రంగా వ్యాపారం చేసిన వారు ఈ కథనం నిజమైతే మునిగిపోయే అవకాశం ఉంది. మరి రేపు ఇంకో ప్రచారం రాదని గ్యారంటీ ఏంటి... అయినా రాజధాని అంటే రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేం లేదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English