మున్ముందు ఇంకా కఠినం

మున్ముందు ఇంకా కఠినం

ఆహా.. మోడీ, ఓహో మోడీ అంటూ దేశమంతా మోడి మానియాలో పడి బిజేపిని గెలిచినందుకు బాధపడుతున్నారా, లేక గాడి తప్పిన భారత్ ను చక్కదిద్దుతున్నారని భావిస్తున్నారా...ఇలా ప్రశ్నిస్తే, ఇటుచెప్పే వారు, అటు చెప్పేవారు వుండనే వుంటారు.   దేశ ప్రగతి కోసం కఠిన నిర్ణయాలు తప్పవని మోడి ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు తాను తీసుకోబోయే నిర్ణయం మీ అందరికి నాపై, బిజేపి పాలనపై ఆగ్రహాన్ని కల్పించినా... తర్వాత నిజమే, కరెక్టే అని మీకే అనిపిస్తుంది అన్నారు మోడి. అయితే ఇంతకీ ఆ కఠిన నిర్ణయాలు ఏమిటి అన్న బెంగతో పాటు ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది. అందుంలోంచి ఓ కఠిన నిర్ణయం ఎట్టకేలకు వెలుబడింది. రైల్వే చార్జీలను అమాంతం పెంచేసారు. తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి చార్జీలు పెంచి ఇప్పుడు ఇది తన నిర్ణయం కాదని, గత ప్రభుత్వమే ధరలు పెంచిందని, ఎన్నికలకు ముందే అమలు కావాల్సి ఉన్నా ఎన్నికల కారణంగా నిలిపివేసిందని, తాను అధికారంలోకి వచ్చాక దానిని ఆపుతూ ఇచ్చిన ఉత్తర్వులకు తాళం తీసానంతే అంటున్నారు. సరే ఆయనేమన్నా.... ధరలైతే పెరిగాయి. రైల్వేలను అభివృద్ది చేస్తాను అని ఆయన ప్రధానిగా తన తొలి ప్రసంగంలో చెప్పినప్పుడే చార్జీలు పెరుగుతాయని భారతావని భావించింది. మరీ... ఇంతగా పెంచుతారని అనుకోలేదంతే. సరే మొదటి కఠిన నిర్ణయమే ఇలా ఉంటే ఇక ముందుముందు తాను చేసిన బాసలన్నీ గట్టున పెట్టి ధేశాభివృద్ది కోసమంటూ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆందోళనయితే అందరిలో మొదలయింది.

 ఆయన తీసుకోబోయే కొన్ని కఠిన నిర్ణయాలు బిజేపి వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాటిలో బిజేపి గతంలో విభేదించిన వాటినే ఈ సారి ఆమోదించి అమలు చేయబోతోంది.  త్వరలో ఆయన మరో అత్యవసర సరకుకు ధరలను పెంచబోతున్నారు. అదే పెట్రోల్. అయితే అందరిలా పెట్రోల్ ధరలు లీటరుకు ఇంత పెంచుతున్నానని ప్రకటించడం లేదు. పెట్రోల్ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడీని తగ్గించనున్నారు. దీంతో ఆటో మేటిక్ గా పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. అంతే కాదు డీజిల్ పై పూర్తిగా సబ్సిడీని ఎత్తివేయనున్నారు. అంటే డీజిల్ ధరలు ఇక పెట్రల్ ధరతో పోటీ పడబోతోంది అన్న మాట. ఈ రెండు పెరిగితే ఆటో మేటిక్ గా ఆర్టీసి చార్జీలు కూడా మనం పెంచుకోవాల్సిందే. రవాణా భారం పెరిగి సరకులు ధరలు కూడా పెరుగుతాయన్న మాట.

 అంతే కాదు వంట గ్యాస్ అంటే ఎల్పీజి , కిరోసిన్ ధరలు కూడా పెంచబోతున్నారు. నిజమైన పేదలకే ఆహార భద్రత అన్న సాకుతో ఆహార భద్రతా బిల్లును కుదించాలని మోడి నిర్ణయించారట. పన్నులు పెంచకుండా ద్రవ్యనియంత్రణ రంగంలో మార్పులు తేనున్నారని సమాచారం. ఎరువుల ధరలను సంస్కరించబోతున్నారు. ఖర్చుల తగ్గింపు పేరుతో అవసరాలపై కేటాయింపులు తగ్గించనున్నారు. ఇలా చేసి గుజరాత్ తరహాలో రెవెన్యూ మిగులును చూపించబోతున్నారు. గుజరాత్ లో మోడి ఈ విధానాలకే ఎక్కువ మొగ్గు చూపారు. ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయబోతున్నారు. సులువుగా భూమి సేకరించేందుకు భూసేకరణ బిల్లులో సవరణలు చేయనున్నారు.
 పట్టువిడుపులు ఉంటాయని బిజేపి ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ఇందులో భాగంగా కార్మిక భద్రతా చట్టంలో మార్పులు తెచ్చి యాజమాన్యాలకు ఇష్టారీతిన వ్యవహరించే హక్కులు కల్పించబోతున్నట్లు తెలిసింది.భారతఆహారసంస్థ, బొగ్గు సంస్థలలో పెను మార్పులు తేబోతున్నారు. టాక్స్ లు, స్లాబులు, మినహాయింపుల్లో స్వల్ప మార్పులు చేయబోతున్నారు.గ్రామీణ ఉపాది పథకాన్ని బాగా కుదించబోతున్నారని తెలిసింది. ఈ నిర్ణయాలన్నీ మోడి ఎప్పుడో తీసుకున్నారని ధశలవారీగా అమలు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే జనాలు మరిన్ని వాతలకు రెడీగా వుండాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు