టెస్టుల్లో ఏపీ రికార్డు – అది మాయంటున్న చంద్రబాబు

దేశం కోటి టెస్టుల మైలురాయిని అధిగమించింది. అదేసమయంలో ఏపీ మిలియన్ టెస్టుల మైలురాయిని అధిగమించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. ఏపీలో మోసం జరుగుతోందని అనుమానపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఏపీలో కరోనా పరీక్షలపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి.

ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ రాగా… ఆయన హైదరాబాదులో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నా ఆయనకు ఇక్కడ నెగెటివ్ వచ్చింది. అపుడే చంద్రబాబు ఏపీలో టెస్టులో నమ్మదగినవి కావని అనుమానం వ్యక్తంచేశారు.

ఏపీలో ఒక వ్యక్తికి కోవిడ్ టెస్టులు చేయకుండానే పాజిటివ్ నిర్దారణ అయినట్లు మెసేజ్ పంపించారు. దీనిపై వైరల్ అవుతున్న వీడియోను చంద్రబాబు షేర్ చేస్తూ ఏపీ సర్కారు తీరుపై విమర్శలు చేశారు. ఏపీలో కరోనా పరీక్షలు వట్టి మాయ అయినా అయుండాలి లేకపోతే కుంభకోణమైనా అయ్యుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉంది, ఇందులో కూడా అదే విధంగా మోసం చేస్తుందని ఆరోపించారు. కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంత నీచానికి దిగజారడం ఏంటి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.