కావూరి రాయబారం: కమలం గూటికి కిరణ్ ?

కావూరి రాయబారం: కమలం గూటికి కిరణ్ ?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తనకు తాను గొయ్యి తవ్వుకుంటే.. దానిని పూర్తిగా సమాధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దక్కుతుంది. విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపి .. కాంగ్రెస్ పై ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఢిల్లీలో ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించి హైకమాండ్ పై యుద్ధం ప్రకటించారు.

చివరికి పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సమైక్య ఉద్యమ నేపథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. కానీ అప్పటివరకు కూడా ఉన్నవాళ్లు వేరే పార్టీలో చేరిపోవడం.. ప్రజలు కూడా ఇక సమైక్యవాదానికి చెల్లు చీటీ ప్రకటించడంతో కిరణ్ పార్టీ కనుమరుగైపోయింది. ఆయన సొంత తమ్ముడు కూడా ఓడిపోవడంతో.. ఇక ఆయన రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఎందుకంటే తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లలేని పరిస్థితి..  అలా అని చూస్తూ చూస్తూ టీడీపీ, వైకాపాలతో కలవలేని పరిస్థితి. దీంతో రాజకీయంగా ఎటువైపు వెళ్లాలన్న ఆలోచనలతో కొంత కాలంగా ఆయన సతమతమవుతున్నారు.

ఇప్పుడు ఆయన చూపు బీజేపీపై పడింది. మోడీ అఖండ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం.. కనీసం పదేళ్లు ఆయన అధికారంలో కొనసాగే అవకాశం ఉందని భావించిన కిరణ్ రాజకీయంగా తనకు బీజేపీ అయితేనే సేఫ్ అని భావిస్తున్నారు. అందుకే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఆయన కమలం గూటికి వచ్చే అవకాశముందని.. ఈ మేరకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మాజీ ఎంపీ.. కావూరి సాంబశివరావు  ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని కూడా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు