కేసిఆర్ వ్యూహమేమిటో?

కేసిఆర్ వ్యూహమేమిటో?

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసిఆర్ రాజకీయులు, రాజకీయ విశ్లేషకులో నోట కేసిఆర్ ఏమిటీ వ్యూహం అనుకునేలా చేసారు. ఆయన స్టైల్ ఏమిటి, ఆయనేం చేయబోతున్నారు అన్న ప్రశ్నలు రేకెత్తించేలా చేసారు. చివరి దాకా అంటే మరో రెండు గంటల్లో ప్రమాణ స్వీకారం ఉంటుందనేదాకా మంత్రి వర్గం విషయం గోప్యంగా ఉంచారు. దీంతో మీడియాతో పాటు రాజకీయ విశ్లేషకులు మంత్రి వర్గంపై రకరకాల ఊహాగానాలు చేసారు. ఆ కోటా, ఈ కోటా అంటూ మంత్రి పదవులు దక్కేవారి జాబితాలతో మీడియాలో ఎన్నో కథనాలు. చివరకు మీడియా కథనాలు, విశ్లేషణలు కొంత మేర మాత్రమే సక్సెస్ కాగా టోటల్ మంత్రివర్గంతో అందరిని నివ్వెరపోయేలా చేసారు కేసిఆర్. దీంతో కేసిఆర్ ప్లాన్స్ ఏమిటి, ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్నలు రేకెత్తాయి.

 నిజానికి ఆరుగురితో ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కాదు... కాదు,  మొత్తం మంత్రి వర్గం 18 మంది ఉంటారని ఊహించారు. సరే టోటల్ సంఖ్య విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా ఆరుగురికి బదులు ఏకంగా 11 మందితో ప్రమాణం చేసారు. అంటే కేసిఆర్ మంత్రుల విషయంలో ముందునుంచే కసరత్తులు చేసారని, కాని ఆ విషయం లీక్ కానీయలేదని క్లియర్ అయింది. ఇక మంత్రి వర్గం అందరి నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. తెలంగాణలో అన్ని రకాల వెనుకబడి ఉన్న జిల్లాలే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు. అలాంటిది ఆదిలాబాద్ జిల్లాకు ఒకటి జోగురామన్న కేటాయించారు. అది కూడా అంతగా ప్రాధాన్యం లేని అటవీ, పర్యావరణం. ఇక ఏడుగురిని గెలిపించిన మహబూబ్ నగర్ కు అసలే కేటాయించకపోవడం అందరిని విస్తు పరిచింది.

 ఇంకా విస్తరణ ఉంది కదా... అనొచ్చు. కాని క్యాబినెట్ పదవులన్నీ అయిపోయినట్టే. ఏమిచ్చినా సహాయ మంత్రులే. మహా అయితే రెండో మూడో క్యాబినెట్ పదవలుండే అవకాశాలు అది కూడా కొంతమేరకే ఉన్నాయి. అటువంటప్పడు ఈ సారి మంత్రి వర్గంలో అసలే చోటు దక్కని మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు ఎన్నిస్తారు, అది కూడా సహాయమంత్రులయితే ఆ జిల్లాల నేతలు సంతృప్తి చెందుతారా.. అన్నది అసలు ప్రశ్న. అంతే కాదు వెనుకబడిన మహబూబ్ నగర్ అబివృద్ది చెందాలంటే కీలకమైన మంత్రి పదవి ఉండాలి. అసలే ఉనికి లేని ఖమ్మంలో పార్టీ బలోపేతం కావాలంటే అక్కడ సరైన మంత్రి పదవి అవసరం. అలాంటి ఆరెండు జిల్లాలను ఎందుకు వదిలేసారు. అయితే ఖమ్మం లోని వైసీపి సభ్యులను లాగే ప్రయత్నంలో ఉన్నారు కేసిఆర్ అన్న వార్తలు వినిపించాయి. అందుకోసమే ఆ జిల్లా కోటా ఖాలీగా వారికోసం ఉంచారా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇదిలా ఉంటే మహమూద్ అలీకి ఉప ముఖ్యమంత్రి ఊహించిందే, దళితుల కోటాలో మరో ఉప ముఖ్యమంత్రి అనుకున్నదే. ఇది అంత పెద్ద మార్పేమి అనిపించలేదు. కాని  అసలు మహిళలే లేకుండా మంత్రివర్గాన్ని ప్రకటించడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. కొండా సురేఖను గ్యారంటీ అన్నారు, ఆ ఊసే లేదు. సరే విస్తరణంలో ఇచ్చినా ఏరిపారేసిన పదవే, అలాంటప్పుడు మహిళలకు సముచిత స్థానం కల్పించినట్టు కాదన్న మాటే. ఇక ఎస్టీలకు అసలే కేటాయించలేదు, ఇది కూడా విడ్డూరమే అనిపించింది. అయితే వన్ షాట్ త్రీ బర్డ్స్ అన్నట్టు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్ననాయి. ఆమెకు ఇస్తే మహిళాకోటా, ఎస్టీ కోటా, వెనుకబడిన జిల్లానే కాకుండా భౌగోళికంగా రెండుగా విడిపోయే ఉండే ఆ జిల్లాలో ప్రతి పార్టీ తూర్పు ప్రాంతానికొకటి, పశ్చిమ ప్రాంతానిక ఒకటి ఇచ్చి సమతుల్యత పాటించినట్లవుతుంది. ఇదే చేస్తే కొండా సురేఖ ఆశలు అడియాసలయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.

 కొప్పుల ఈశ్వర్ కు చాలా ముఖ్యమైన శాఖ వస్తుందనుకుంటే దక్కలేదు. అయితే ఆయనకు స్పీకర్ పదవి ఇస్తున్నట్టు వార్తలు వెలుబడ్డాయి. శాఖల కేటాయింపులోను వండరే జరిగింది. నాయినికి హోంశాఖ అనుకున్నారు, తనయుడు కేటిఆర్ కు పరిశ్రమలు అనుకున్నారు. కాని కేటిఆర్ కు పంచాయత్ రాజ్, ఐటి దక్కాయి. హరీష్ రావుకు నీటిపారుదల శాఖ... ఫర్వాలేదు.  అయితే మంత్రి పదవులు గ్యారంటీ అనుకున్న పలువురు సీనియర్లకు మొండి చేయి చూపడం, కేటాయించిన వారికి రెండు మూడు శాఖలు ఇవ్వడం అందరిని ఆశ్యర్యపరిచింది. ఇలా ప్రధాన శాఖల కేటాయింపులు అయిపోయాయి. ఇప్పుడు విస్తరణలో ఇచ్చేందుకే ఏరిపారేసినవే మిగిలాయి. అంటే మిగిలిన సీనియర్ల పరిస్థితి తుస్సే.  ఇక కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ శాఖలు తనవద్దనే ఉంచుకుని కేసిఆర్ మరింత ఆశ్యర్యపరచారు. మొత్తం మీద తన పాలన అందరు ఊహించినట్టు ఉండదు సుమా... అన్న సంకేతాలను జారీ చేసారు కేసిఆర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English