చిరు, రఘువీరా.. వీళ్లు మారరు

చిరు, రఘువీరా.. వీళ్లు మారరు

రాష్ట్ర విభజన చేసిన పాపానికి నవ్యాంధ్రప్రదేశ్‌లో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయినా ఆపార్టీ నేతలకు ఇంకా బుద్ధిరాలేదు. ఓటమికి కారణం స్పష్టంగా తెలిసినా డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేయడం మానలేదు. ఈ దుస్థితికి కారణం తామేనన్న సిగ్గులేకుండా ఇంకా అధిష్ఠానం భజనలోనే ఆపార్టీ నేతలు ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పార్టీ ఓటమిపై నివేదిక రూపొందిచి తమను కలవాలని ప్రచార కమిటీ సారథి చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలను అధిష్ఠానం ఆదేశించింది. దీంతో మన సిగ్గులేని నేతలు పేద్ద నివేదిక ఒకటి రూపొందించుకుని టిప్‌టాప్‌గా తయారై ఢిల్లీ వెళ్లారు.

కాంగ్రెస్‌ ఓటమికి కారణమేంటని సీమాంధ్రలో చిన్నపిల్లవాడిని అడిగినా ఠక్కున సమాధానం చెబుతాడు. రాష్ట్రం విభజన కన్నా అది చేసిన తీరువల్లే ఆపార్టీని పాతాళానికి తొక్కేశారని వివరిస్తాడు. కానీ మన సిగ్గులేని నాయకులు మాత్రం ఓ పేద్ద నివేదికను తయారు చేసుకొని అమ్మను దర్శించుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. ముందు రాహుల్‌తోనూ, తర్వాత సోనియాతోనూ భేటీ అయ్యారు. ఇదేంటి ఫలితాలు ఇంత దారుణంగా ఉన్నాయని ప్రశ్నించిన సోనియాకు.. మీరు చేసిన నిర్వాకం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పే ధైర్యం చేయలేకపోయారు మన నేతలు.

ఓటమికి కారణం అధిష్ఠానందేమీ కాదని పార్టీని వీడిపోయిన నేతలవల్లే ఓడిపోయామని కొత్త భాష్యం చెప్పారు. మాజీ సీఎం కిరణ్‌ చేసిన ప్రచారం వల్లే ఇంత నష్టం వాటిల్లిందని తేల్చి చెప్పేశారు. అధిష్ఠానానిదేమీ తప్పలేదని పొగడ్తలతో ముంచెత్తేశారు. భక్తుల ప్రశంసలతో సంతుష్టులై అమ్మవారు సర్లెండి ఇంక విశ్లేషణలు అవీ ఎందుకు గానీ వెళ్లి పార్టీని బలోపేతం చేయండి అని రఘువీరా, చిరులను అనుగ్రహించేశారు. అమ్మవారి ఆదేశాలను వేదవాక్కుగా భావించి..తిరుగు ప్రయాణం కట్టేశారు. వెన్నెముక లేని మన నేతలనుంచి ఇంతకంటే ఏమైనా ఆశించగలమా మీరే చెప్పండి??

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు