బాలీవుడ్ ఐకాన్ మరొకరు వెళ్లిపోయారు

గడిచిన మూడు నెలలుగా ఎవరో ఒక బాలీవుడ్ ప్రముఖులు మరణిస్తున్న వైనం చూస్తున్నదే. వరుస పెట్టి విషాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిత్ర పరిశ్రమకు మరో విషాదం ఎదురైంది. ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకురాలు.. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆమె ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శాశ్విత నిద్రలోకి జారిపోయారు.

గత నెల 20న శ్వాసకోశ సమస్య కారణంగా ఆమె ముంబయి బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కోవిడ్ పరీక్షను నిర్వహించారు. ఫలితం నెగిటివ్ రావటంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న వేళ.. అనూహ్యంగా ఆమె మరణం బాలీవుడ్ కు తీవ్ర విషాదాన్ని మిగిలిస్తే.. ఆమెను అమితంగా అభిమానించే అభిమానులకు షాకింగ్ గా మారింది.

బాలీవుడ్ ఐకానిక్ గా పేరున్న సరోజా ఖాన్ 1948 నవంబరు 22న జన్మించారు. బాలీవుడ్ మాస్టర్జీగా పాపులర్ అయిన ఆమెను అందరూ సరోజ్ ఖాన్ గా గుర్తిస్తారు కానీ ఆమె అసలు పేరు మాత్రం నిర్మల్ కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. ఆమె భర్త సోహన్ లాల్. వారికి ఇద్దరు కమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో దాదాపు 200 సినిమాలకు పైనే కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆమె సొంతం. అంతేకాదు.. దాదాపు 2 వేలకు పైగా పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు.

అతిలోక సుందరి.. దివంగత శ్రీదేవి.. మాధురీ దీక్షిత్ లాంటి ఎందరో ప్రముఖ నటీమణులు నటించిన పాటలకు కొరియోగ్రఫీ చేసిన సరోజ్ ఖాన్ తన ముద్రను బాలీవుడ్ మీద బలంగా వేశారని చెప్పాలి. నాగినా.. మిస్టర్ ఇండియా.. తేజాబ్.. భన్సాలీ దేవదాస్.. జబ్ వి మెట్ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఆమె నృత్య దర్శకత్వం వహించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె లేని లోటు బాలీవుడ్ కు ఎవరూ భర్తీ చేయలేరనే చెప్పాలి.