రాజ‌మౌళీ.. ఏం బ్యాలెన్స్ చేశావ‌య్యా

శుక్ర‌వారం రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆర్ఆర్ఆర్ మూవీలో అత‌డి పాత్రను ప‌రిచ‌యం చేస్తూ ఒక చిన్న టీజ‌ర్ ఒక‌టి వ‌దిలాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇందులో చ‌ర‌ణ్ లుక్, అత‌డి స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజిలో ఉండ‌టంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేక‌పోయాయి.

చ‌ర‌ణ్ కెరీర్లో ఈ పాత్ర మ‌రో మైలురాయిలా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపించింది. ఐతే సినిమా నుంచి ముందు ఎన్టీఆర్‌ది కాకుండా చ‌ర‌ణ్ పాత్ర తాలూకు టీజ‌ర్ రిలీజ్ చేస్తుండ‌టం ప‌ట్ల ముందు నంద‌మూరి అభిమానుల్లో ఒకింత నిరాశ వ్య‌క్త‌మైంది. కానీ టీజ‌ర్ చూశాక మాత్రం వాళ్ల నిరాశ అంతా ఎగిరిపోయింది. ఈ టీజ‌ర్లో చ‌ర‌ణ్ ఎలా హైలైట్ అయ్యాడో ఎన్టీఆర్ సైతం అదే స్థాయిలో హైలైట్ కావడం విశేషం.

చ‌ర‌ణ్ బ‌ర్త్ డే టీజ‌ర్లో తార‌క్ క‌నిపించ‌కుండానే త‌న‌దైన ముద్ర వేశాడు. ఆ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసింది తార‌కే. ఇందుకోసం అదిరిపోయే డైలాగులు రాయ‌డం.. ఆ డైలాగుల్ని తార‌క్ త‌న‌దైన వాచ‌కంతో అద్భుత రీతిలో చెప్ప‌డం.. నా అన్న మ‌న్నెం దొర అల్లూరి సీతారామ‌రాజు అంటూ గూస్ బంప్స్ ఇచ్చేలా పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డంతో చ‌ర‌ణ్ పాత్ర తాలూకు ఎలివేష‌న్ ఓ రేంజికి వెళ్లిపోయింది.

మెగా, నంద‌మూరి అభిమానులు ఎవ్వ‌రూ నిరాశ చెంద‌కుండా.. అంద‌రూ క‌లిసి సెల‌బ్రేట్ చేసుకునేలా ఈ టీజ‌ర్‌ను రాజ‌మౌళి బ్యాలెన్స్ చేసిన తీరు అమోఘం. ఇదే బ్యాలెన్స్ సినిమాలోనూ జ‌క్క‌న్న పాటిస్తాడ‌న్న న‌మ్మ‌కాన్ని టీజ‌ర్ క‌లిగించింది. సినిమాలో హీరోలిద్ద‌రూ ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటూ బ్రిటిష్ వారిపై పోరాడేలా క‌థ ఉంటుంద‌ని కూడా ఈ టీజ‌ర్‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మైంది.