మోడీ జపం వెనుక జగన్ మర్మమేమిటి

మోడీ జపం వెనుక జగన్ మర్మమేమిటి

ఒక్క రోజుతో సీమాంద్రలో ప్రచారం ముగుస్తుందనగా జగన్ అనూహ్యంగా తన ట్రెండు మార్చారు. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు చివరి రోజులను చక్కగా వినియోగించడం రాజకీయుల లక్షణమే. అందులో భాగంగా జగన్ సడన్ నిర్ణయం తీసుకున్నారా, లేక నిజంగా ఆయన విధానం కూడా అదేనా అన్నది చర్చనీయాంశం అయింది. ఆయన అంతరార్థం ఏమైనప్పటికి తీసుకున్న నిర్ణయం మాత్రం టిడిపికి తాను భావించిన దానికి దెబ్బే అంటున్నారు.

టిడిపికి నష్టం అంటే ఆ విధానాన్ని అవలంబించడం జగన్ రాజకీయంగా తీసుకున్న మంచి నిర్ణయమే అంటారు. అది ప్రత్యర్థికి నష్టాన్ని తెచ్చిపెడుతూ తనకు లాభం తెచ్చి పెట్టే విధంగా ఉంటే ఇక అది రాజకీయ చాణక్యమే అనక తప్పదు. రాజకీయాల్లో పసికూనగా అభివర్ణించబడున్న జగన్ ఇంత తెలివైన విధానాన్ని ఎలా ఎంచుకున్నాడబ్బా అన్నది కూడా పరిశీలకుల మదిని తొలుస్తోంది.
ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి, నెల్లూరు జిల్లా కావలి బహిరంగసభల్లో మాట్లాడుతూ కేంద్రంలో మోడీతోనే కలసిపోతాం అన్నారు. కాంగ్రెస్ తో జత కట్టేది లేదన్నారు. ఇది విన్న వారికి మతిపోయినంత పని కాకపోయినా ఆశ్చర్యం మాత్రం వేసింది. ఎందుకంటే ఇన్నాళ్లు జగన్ కేంద్రంలో ఎవరితో దోస్తానా చేస్తానో చెప్పలేదు. అంటే తాను ఏ పార్టీకి మద్దతిస్తాడో అన్న విషయం అన్నమాట.

అంతే కాదు నిన్నటి వరకు ఒక్క కాంగ్రెస్, టిడిపిని తప్ప బిజేపిని ప్రచారంలో పల్లెత్తు మాట అనలేదు. అయితే మోడీనే స్వయంగా జగన్ పై విమర్శల బాణం ఎక్కు పెట్టారు. ఆర్థిక నేరగాళ్లకు ఓటు వేస్తారా, బెయిల్ పై వచ్చిన వారిని గెలిపిస్తారా అంటూ జగన్ పై విరుచుకుపపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా మోడీని, బిజేపిని టార్గెట్ చేసుకుంటారు అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆయనతోనే కలసి పోతాం అనే సరికి టిడిపికి మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయినంత పనయింది.

కారణం మోడిపై ఒత్తిడి తెప్పించి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడించడం ద్వారా లబ్దిపొందాలని చూసారు. కేంద్రం లో మోడీ సర్కారే వస్తుందని అంతటా ప్రచారం జరిగింది. విభజించింది అన్న కోపంతో కాంగ్రెస్ పై కోపంతో ఉన్న సీమాంద్ర జనం కేంద్రం విషయంలో బిజేపివైపే మొగ్గు చూపుతున్నారు. సీమాంద్ర రాష్ట్రం డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వ సర్కారు సహాయం అవసరం.
ఈ కోణంలో కేంద్రంలో అధికారం వచ్చే బిజేపితో దోస్తానా చేస్తున్న టిడిపిని గెలిపించుకోవాలన్న భావం కలిగి తనకు లాభం చేకూరుతుంది అనుకున్నారు చంద్రబాబు. అయితే జగన్ కూడా అనూహ్యంగా తన ట్రెండ్ మార్చేసరికి ఇప్పుడు సీన్ మారే అవకాశాలు ఉంటాయి. జగన్ ను గెలిపించినా సరే ఆయన కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బిజేపికే మద్దతిస్తారు. కాబట్టి మనకు నష్టం లేదు. పైగా జగనే గెలుస్తారు అన్న సర్వేల రిపోర్టు చూసి కూడా టిడిపికి వేస్తే నష్టమే అన్న భావం కలిగే అవకాశాలు ఉంటాయి. దీంతో తనను తిట్టినా మోడికి మద్దతు తెలుపడం ద్వారా జగన్ రాజీకీయంగా చక్కటి పాచికనే వేసారు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు