చంద్రబాబు - యుద్ధ వ్యూహాలు

చంద్రబాబు - యుద్ధ వ్యూహాలు

ఎన్నికలు అంటే యుద్ధమే. ప్రత్యర్థులపై పై చేయి కావడానికి ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్నీ ఆలోచించాలి. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం విజేత గా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో తెలుగుదేశం అభిమానులు పొంగిపోతున్నారు. నాయకులు టిక్కెట్ల కోసం కొట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు పడిన పాట్లు, చేసిన ఆలోచనలు, పన్నిన వ్యూహాలు తలుచుకుంటే అబ్బురమనిపిస్తుంది.

ఉద్యమనేపథ్యంలో పార్టీ ఏమై పోతుందో అన్న పరిస్థితి. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర అంటూ తమ్ముళ్లు రెండుగా చీలిన వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీ సమైక్య స్టాండ్ తీసుకుంది. పార్టీని అటు నడిపితే ఇటు కష్టం, ఇటు నడిపితే అటు కష్టం. అలాంటి పరిస్థితుల్లో తన పార్టీ వారందని కట్టడి చేయడం అంటే మాటలు కాదు. అందునా అధికారంలో లేకుండా. అప్పటికే కొంతమంది జారిపోవడం ప్రారంభమైపోయింది. కానీ జంకకుండా పార్టీని నియంత్రిస్తూ వచ్చారు. ఢిల్లీలో సమన్యాయం కోసం ప్రయత్నించారు. ఆఖరికి విభజన జరిగింది. ఎన్నికలు రానే వచ్చాయి.
కదనోత్సాహంతో వైకాపా కదం తొక్కడం ప్రారంభించింది. అప్పటికే ఆ పార్టీకి అభ్యర్థుల జాబితా కూడా డిసైడ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బాబు తన వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. మూసివేతకు సిద్ధంగా వున్న కాంగ్రెస్ కంపెనీ జనాలను టోకుగా తన కంపెనీలోకి తీసుకోవడం ప్రారంభించారు. దాంతో తేదేపాలో ఏదో జరుగుతోంది అన్న టాక్ బయల్దేరింది. టికెట్ లు ఇస్తారా..ఇవ్వరా అన్నది తరువాత, ముందు వచ్చినవారిని అందరినీ కండువా కప్పి లోపలకు పిలవడమే. రాష్ట్రం మొత్తం ఇలా వచ్చేవారితో హడావుడిగా మారింది. కళ్లు మూసి తెరిచేసరికి కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిపోయింది. వైకాపా ఉలిక్కి పడింది. తను కూడా అదే వ్యూహాన్ని అనుసరిద్దామనుకున్నా, ఒకటీ అరా తప్ప ఎవరూ మిగలలేదు.

తెలుగుదేశం మొదటి ఎత్తుగడ సక్సెస్
టికెట్ ల కేటాయింపు సమయం వచ్చేసింది. తెలంగాణలో ఉన్నట్లుండి బాంబు పేల్చారు చంద్రబాబు. బిసి లకే ముఖ్యమంత్రి పదవి. జనం రకరకాలుగా అన్నారు. సీమాంధ్రలో ఇవ్వకుండా ఇక్కడేమిటి? అక్కడ ఆయనకు కావాలి కాబట్టి ఇక్కడిస్తున్నారు ఇలా. నిజమే. కంపెనీ చైర్మన్ అన్నాక యజమానే వుంటారు. ఎండీగా ఎవర్ని పెట్టుకున్నారన్నపుడు ఆలోచన వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు చేసింది అదే. తన పార్టీకి మరో చోట ముఖ్యమంత్రి పోస్టు అవకాశం వస్తోంది. ఎవరికి ఇవ్వాలి. ఇక్కడ అగ్రకులానికి వుంది. మరి అక్కడ వెనుక బడిన కులానికి. మంచి స్ట్రాటజీనే. దీంతో అక్కడ  ప్రత్యర్థి టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. అలా అని పదవి వదులుకోలేదు. మరేమీ చేయలేదు. అదే సమయంలో సీమాంధ్రలో తనకు దూరమైన కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసారు. వీలయినంత వరకు కీలక స్థానాల్లో వారికి టికెట్ లు ఇచ్చారు.
 
బాబు రెండో ఎత్తుగడ కూడా సక్సెస్
ఎలా సాధించినా విజయం విజయమే. కృష్ణుడంతటివాడే, రకరకాల సైగలు చేసి పాండవులను గెలిపించాడు. అందుకే చంద్రబాబు కూడా మరోసారి భాజపా పొత్తు కోసం ప్రయత్నించాడు. గతంలో వద్దన్నది నిజమే. కానీ ఇప్పటి భాజపా ఊపు వేరు. మోడీ జ్వరంతో, జపంతో ఊగిపోతోందా పార్టీ. అందుకే  ఆ పార్టీ అండ తనకు అవసరం అనుకున్నాడు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాడు. తనంతట తానే ముందుకు వెళ్లాడు. తెలంగాణలో ఉదారంగా సీట్లు వదిలేసాడు. సీమాంధ్రలో గట్టిగా పట్టుకున్నాడు. ఎలాగోలా పొత్తు కుదర్చుకున్నాడు.

బాబు మూడో పాచిక కూడా పారింది.
పొత్తు కుదిరింది. సీట్లు ఇచ్చేసాడు. పార్టీలో తలకాయ నొప్పలు ప్రారంభమయ్యాయి. సామ, దాన, బేధ, దండో పాయాలు అన్నీ ప్రయోగించాడు. చాలా వరకు సద్దుమణిగాయి. ఇక కావాల్సింది జనాలకు దిశానిర్దేశం. కేవలం అవినీతి జపం చేస్తే, జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. అందుకే కొత్త ఎత్తుగడ వేసారు. తన అనుభవం కొత్త రాష్ట్రాల అభివృద్ధికి అవసరం అన్నది చెప్పడం ప్రారంభించారు. సైబరాబాద్ ను నిర్మించిన తాను మాత్రమే కొత్త రాజధానిని నిర్మించగలని తెలియచెప్పారు అదే సమయంలో తెలంగాణ వారికి అండగా వుండానని అక్కడా చెప్పగలిగారు. దీంతో ఇప్పుడు జనం ఆలోచనలో పడ్టారు. అనుభవం లేని కెసిఆర్, జగన్ ల కన్నా బాబు బెటర్ చాయిస్ అన్న ఆలోచనలు మొగ్గ తొడిగాయి.

బాబు నాలుగో ఆలోచన ఫలితాన్నిచ్చింది.
ఎన్నికలు , ప్రచారం అన్నాక చరిష్మా అవసరం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో సహకరించారు. మరి ఇప్పుడెలా? బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణకు టికెట్ ఇచ్చారు. అతగాడిని ప్రచారానికి పంపారు. అది సరిపోతుందా. జనం వైఖరి గమనించారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనుక జనం వున్నారని గమనించారు. రజనీ కాంత్ కోసం గుజరాత్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మోడీ స్వయంగా వెళ్లగా లేనిది, పవన్ కోసం తాను వెళ్తే తప్పేమిటి? అందుకే ఎవరు ఏమనుకున్నా అడుగు ముందుకేసారు. పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ తన మద్దతు తెలుగుదేశానికి అని బాహాటంగా, స్పష్టంగా ప్రకటించేలా చేసారు. ఇది మరోలా కూడా ఫలితాన్నిచ్చింది. తప్పనిసరై జూనియర్ ఎన్టీఆర్ అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది.

బాబు అయిదో అడుగు కూడా ముందుకే పడింది.
ఈ అడుగులు , ఆలోచనలు అన్నీ జనం కళ్ల ముందు కనిపించేవి. ఇంకా కనిపించని బాబు వ్యూహాలు చాలా చాలా  వున్నాయి. బలమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్వహించడం. ఏ పార్టీకి లేనంతగా సంస్థాగత కార్యాలయాన్ని, అందులో సిబ్బందిని నియమించి, రకరకాలుగా నియోగించడం. అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ యువతలో ఆలోచన రేకెత్తించడానికి ఓ విభాగం, ప్రచార వ్యూహాల కోసం మరొకటి. ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, వినియోగం, వితరణ కోసం మరి కొందరు. ప్రచార చిత్రాలు, పాటలు, ఆటలు ఇలా ఎన్నో.
ఇన్ని వ్యవహారాలు, ఇన్ని ఎత్తుగడలు, ఇన్ని ఆలోచనలను తన మేథతో నియంతృస్తూ, ముందుకెళ్తుంటే, బాబు వెంట ఎందుకు రాదు విజయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు