కేకేకు కేసీఆర్ ఏం ఇవ్వనున్నారు

కేకేకు కేసీఆర్ ఏం ఇవ్వనున్నారు

టీఆర్ఎస్ పార్టీలోకి చేరే వారంతా ప్యాకేజీల కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే వాటిని టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు అది వేరే విషయం. కాకపోతే.. ఆసక్తికరమైన అంశమేమంటే.. కేకే వ్యవహారం. ఆయనకు, ఆయన కుమారుడికి రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వనున్నట్లు భారీగా ప్రచారం జరిగింది. మీడియా కూడా పదే పదే ఈ విషయంపై ఆయన్ను ప్రశ్నించింది కూడా. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే.. తనకు తానే ప్రెస్ మీట్ పెట్టి... తనకు, తన కుమారుడికి ఎక్కడా పోటీ చేసే ఉద్దేశ్యం లేదని చెప్పటంతో పాటు... తాను ఎన్నికల బరిలోకి చచ్చినా దిగనని శపథం చేసినట్లుగా చెప్పారు. అదేంటి.. కేకే అంతలా మారిపోయారని ఆశ్చర్యపోయిన వాళ్లు ఉన్నారు. కేకే లాంటి నేత.. రాజకీయాల్లో ఇంత చైతన్యంగా ఉండి ఇలా మాట్లాడుతున్నారేమిటని అవాక్కైన వాళ్లూ ఉన్నారు.

టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు చేరారంటే అది కేకే మంత్రాగమేనన్నది బహిరంగ రహస్యం. తన కోసం ఇంత చేస్తున్న కేకేకు కేసీఆర్ ఏం ఇవ్వనున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరికి అసలు విషయం బయటకు వచ్చింది. అయితే విశేషమేమంటే... తాను కేకేకు ఇవ్వబోతున్న దాని గురించి కేసీఆర్ అన్యాపదేశంగా చెప్పుకొచ్చారు. నిజాం కాలేజీలో సభలో మాట్లాడుతూ... ‘‘కేకే ఢిల్లీ స్థాయి వ్యక్తి. ఆయన రాజ్యసభలో ఉండి.. తెలంగాణ వాదం కోసం బయటకు వచ్చారు. అలాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండాలి. కేశవరావు తెలంగాణ గురించి మాట్లాడినందుకే ఆయనకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆయన్ను టీఆర్ఎస్ గౌరవించుకుంటుంది. పార్లమెంటులో ఆయన అవసరం ఉంది’’ అంటూ చెప్పారు. అర్థమైందా... కేసీఆర్ సారు... కేకే సాబ్ కి ఏం ఇవ్వనున్నారో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు