కేసీఆర్ నోట వివాదాస్పద పల్లవి

 కేసీఆర్ నోట వివాదాస్పద పల్లవి

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. నోరు జారటం అలవాటే. దానికి భావోద్వేగాన్ని జత కలిపి.. నేను ఏమన్నా... ఇంతే కదా. ఇదంతా కడుపు మండితే వచ్చిన మాటలంటూనే తాను తిట్టాల్సిన వారిని నాలుగు తిడుతుంటారు. గతంలో ఇలానే నోరు జారితే మంద కృష్ణ మాదిగ ఆయన ఇంటిని ముట్టడించబోయారు. ఛివరికి.. తగ్గిన కేసీఆర్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. అలా.. ఈ మధ్య ప్రధాని మన్మోహన్ పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. దానిపై  ఓ న్యాయవాది ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించాడు. కానీ.. వారు కేసు నమోదు చేయటానికి సుముఖత వ్యక్తం చేయకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. ప్రధాని పై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని  ఖమ్మం అడిషినల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించడమే కాకుండా విచారణ నివేదికను సమర్పించాలని కోరింది.

ఈ నేపథ్యంలో... నిజాం కాలేజీలో జరిగిన బహిరంగ సభలో మరోమారు తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతే కాదు.. ప్రధాని పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. వ్యాఖ్యలను ఉపసంహరించుకోనంటూ.. అవసరమైతే  జైలు కెళ్లడానికైనా సిద్ధమన్నారు.  ఇంతకీ ఆయనేమన్నారంటే.. ‘‘పార్లమెంటులో అందరు ఎంపీలు పోతుంటే చప్రాసీలు నమస్తే సాబ్ అంటరు. పార్లమెంటులో నేను, విజయశాంతి పోతుంటే చప్రాసీలు జై తెలంగాణ సాబ్ అంటరు. తెలంగాణ న్యాయమైన డిమాండు, గట్టిగా కొట్లాడండి అని అంటరు. ప్రధానమంత్రికేమో అర్థమైతే కాలేదు. చప్రాసీలకు అర్థమైనంత కూడా ప్రధానమంత్రికి అర్థం కాలేదు అని అన్న. దీంట్లో తప్పేంది? దీంట్లేదో తప్పుందని నా మీద ఖమ్మంలో ఓ పుణ్యాత్ముడు కేసు పెట్టిండ్రట’’ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ప్రధాని బండరాయిలెక్క కూసుంటడని కేసీఆర్ తెలిపారు. కనీసం చప్రాసీకి ఉన్న చలనం ప్రధానికి లేదని ఎద్దేవా చేశారు. అసలు ఆయనకు అర్థంకాదా, అర్థమైనా అలాగే కూర్చుంటున్నాడా అనే విషయం అర్థం కాదని తెలిపారు. తెలంగాణ అనడంలో ఏమైనా తప్పుందా అని ప్రశ్నించారు. తన మాటల్ని వివాదాస్పదం చేయటంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. దాన్ని తన ఉద్యమానికి అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు.  మరి ఈదఫా పోలీసులు.. కోర్టులు ఎలా స్పందిస్తాయో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు