ఈ దెబ్బతో కాంగ్రెస్ కు రెడ్లు మరింత దూరం!

ఈ దెబ్బతో కాంగ్రెస్ కు రెడ్లు మరింత దూరం!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి కొంచెం అండగా ఉంటున్న కులం ఒకటి, కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న కులం మరొకటి. కులరహిత సమాజం కోసం  పాటు పడేవారికి ఇటువంటి విశ్లేషణలు నచ్చకపోవచ్చుగాక! ప్రస్తుత రాజకీయాలు కుల సమీకరణాలతో పెనవేసుకుపోయాయి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే... కాంగ్రెస్ లో చిరంజీవి మీసం మెలేస్తున్నాడని ఇక చిరంజీవిని అభిమానించే కాపులంతా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు, ముఖ్యమంత్రిని తమ మాటలతో అవమాన పరిచిన వారు చాలా మందే ఉన్నా.. కేవలం డీఎల్ రవీంద్రరెడ్డి మీద మాత్రమే వేటు పడటంతో ఈ మొత్తం వ్యవహారంలో కుల సమీకరణాలు మొదలయ్యాయి. అనేక సార్లు ముఖ్యమంత్రిని అవమాన పరుస్తూ మాట్లాడి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి పనికిరాడు అన్నట్టుగా మాట్లాడిన మంత్రి చింతకాయల రామచంద్రయ్యపై వేటు వేయకుండా కేవలం డీఎల్ రవీంద్రరెడ్డిని మాత్రమే కనీసం షోకాజ్ కూడా చూపకుండా బర్తరఫ్ చేయడంపై ఆశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి.

రామచంద్రయ్య, రవీంద్రరెడ్డి ఇద్దరిపైనా ముఖ్యమంత్రికి ఉన్న కోపం సమానమే! అయితే అధిష్టానం రవీంద్రరెడ్డి విషయంలో ముఖ్యమంత్రికి స్వతంత్రం ఇచ్చింది. రామచంద్రయ్య విషయంలో మాత్రం ముఖ్యమంత్రి ఏమీ చేయలేని వాడిగా మిగిలిపోయాడు. అందుకు కారణం చిరంజీవి అనే వారు లేకపోలేదు. విలీన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం రామచంద్రయ్య విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోయింది. ఇలా పరోక్షంగానైనా ఒక కాపు నాయకుడి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకోలేకపోయింది, రెడ్డి మంత్రిపై మాత్రం వేటుకు వెనుకాడలేదు! దీంతో ఒకప్పుడు కాంగ్రెస్ ను సొంతమనుకున్న రెడ్డిలు ఇప్పుడు మరింత దూరం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు