నీల్సన్ సర్వే నిజమా... విడ్డూరమా?

నీల్సన్ సర్వే నిజమా...  విడ్డూరమా?

సర్వేలపై ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే సర్వే సంస్థలు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నాయి. అయితే ఈసర్వేలన్నీ ఏదో ఓ పార్టీవైపు మొగ్గు చూపుతున్నా కూడా మిగిలిన పార్టీలను పూర్తిగా తీసిపారేయలేదు. కాని తీరా ఎన్నికలు ఇక వచ్చేసాయి. ఓటరు తీర్పు ప్రకటించడానికి ఎంతో సమయం లేదనుకుంటున్న తరుణంలో నీల్సన్- ఎన్టీవి సర్వే సంచలన విషయాన్ని ప్రకటించింది. అది చూసి ఇది నిప్పులాంటి నిజమా, విడ్డూరమా అన్నదే అనుమానంగా వుంది. ఇందుకు కారణం లేకపోలేదు.  వివిధ కారణాల రీత్యా బలహీన పడ్డాయి అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్న వైకాపా, టిఆర్ఎస్ లు అఖండ విజయాన్ని సాధిస్తున్నాయి అన్నది ఈ సర్వే చెప్పిన నిజం. ఇది ఎంత వరకు నిజం అన్న అనుమానాలు రావడానికి కూడా ఆ సర్వే అనేక అవకాశాలు కల్పించింది. అదేంటంటే సీమాంద్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 ఉంటే వైకాపాకు 128 నుంచి 131 సీట్లు వస్తాయంది, టిడిపికి 41 నుంచి 46 వరకు వచ్చే అవకాశం ఉంది అని పేర్కొంది.
కాని బిజేపికి ఇప్పుడు పవన్ రాకతో కాస్తయినా ఊపు వచ్చిందంటున్నారు.   ఎంతో మంది సినిరంగప్రముఖలు, ప్రముఖ రాజకీయ నాయకులు మోడీ పట్ల మొగ్గుతున్నారు. దీని వల్ల భాజపా విజయాలు సాధించలేదేమో కానీ, ఎన్నో కొన్ని ఓట్లు లాక్కుంటుంది. కాని దానికి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే చెప్పడమే విడ్డూరంగా ఉంది. పోని అది ఒక్క సీటు గెల్చుకోకున్నా కూడా ఓట్లను చీల్చుతుంది. అదే నిజమైతే వైకాపాకు ముందు నుంచి వస్తాయని భావిస్తున్న సీట్లలో కొంత తగ్గాలి, కాని ముందు చేసిన సర్వేకు ఇప్పటి సర్వేకు పెరిగింది.
ఇక తెలంగాణ విషయంలోను అంతే, తెలంగాణాలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలలో టిఆర్ఎస్ కు 51 నుంచి 60 వరకు వస్తాయని, కాంగ్రెస్ కు 44 నుంచి 46 వరకు వస్తాయని చెప్పింది. అంతే కాదు ఇక్కడ కూడా ఈ రెండు పార్టీలకు తప్ప మరే పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదంది. ఇది ఎంతవరకు నమ్మదగిన నిజం. సీమాంద్రలో బిజేపికి అసలే రావంటే కాస్తా నమ్మవచ్చేమో. తెలంగాణలో బిజేపికి అసలే రావంటే ఎలా, దానికి ఇప్పటికే సిట్టింగులు ఉన్నారు. అంతే కాదు తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీగా, ఎప్పటి నుంచో ఒక్క ఓటు రెండు రాష్ట్రాల నినాదం తీసుకుని తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడ్డ పార్టీగా దానికి పట్టుంది. విభజన రాజకీయాల కంటే ముందు కూడా తెలంగాణలో బిజేపికి పట్టున్న ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి తెలంగాణలో బిజేపి కి నిల్ అంటే దానర్థం ఏంటి.
సరే ఇంకా పొత్తుల ఎత్తులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఏపార్టీ కూడా పొత్తులను ఖరారు చేసుకోలేదు. అది జరిగితే పూర్తిగా సమీకరణలు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. కాని ఈ సర్వేకు నేతృత్వం వహించిన నీల్సన్ ప్రతినిధి మాత్రం అది అంతగా ప్రభావం చూపదని, స్వల్ప తేడా మాత్రం ఉండొచ్చని అన్నారు. మొత్తం మీద అప్పుడు కూడా సీమాంధ్రలో వైకాపా, తెలంగాణలో టిఆర్ఎస్ అధికారానికి సరిపడా మెజారిటితో ఏక పార్టీ పాలన అంటే హంగ్ కాకుండా సుస్థిర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తాయని చెప్పారు. అందుకే ఇది పార్టీల భవిష్యత్తు తేల్చిన నిప్పులాంటి నిజమా, లేకా విడ్డూరమైన పలితాలా అన్న భావం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు