డీఎల్ అడుగులు ఎటు..

డీఎల్ అడుగులు ఎటు..

మంత్రి పదవి కోల్పోయిన డీఎల్ తదుపరి కార్యచరణ ఏమిటి అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారా? లేదంటే పార్టీ మారతారా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ గాలం వేసినట్లుగా చెబుతున్నారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం తర్వాత కాంగ్రెస్ లో అంతో ఇంతో బలమైన నేత అంటే డీఎల్ అనే చెప్పాలి. అలాంటి డీఎల్ కనుక తమ పక్క ఉంటే రానున్న ఎన్నికల్లో కడప జిల్లాలో స్వీప్ చేయొచ్చన్నది వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం భావనగా చెబుతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలోనే ఇందుకు సంబంధించిన అడుగులు పడినట్లు చెబుతారు.

జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మైసూరారెడ్డి ఇందుకు సంబంధించిన మంత్రాంగం నడిపినట్లు చెబుతారు. అయితే.. ఈ ఆఫర్ పై డీఎల్ అంతగా మక్కువ చూపలేదన్నది వాదన. అయితే తాజా పరిస్థితుల్లో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆయన పార్టీ మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ పై పోటీ చేసి డిపాజిట్టు కోల్పోయిన ఆయన.. ఇప్పుడు ఆయన పార్టీలోనే చేరటం చూసినప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమనే అభిప్రాయం నిజమేనని అనిపించక మానదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు