డీఎల్ పదవికి వారసులెవరు..?

డీఎల్ పదవికి వారసులెవరు..?

ముఖ్యమంత్రి కిరణ్ బర్తరఫ్ చేసిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పదవికి వారసులెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీఎల్ వల్ల ఖాళీ అయిన మంత్రి పదవిని కడప జిల్లా ఎమ్మెల్యేలకు కట్టబెట్టాల్సి ఉంది. కడప జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన డీఎల్ స్థానాన్ని పార్టీలో భర్తీ చేయటానికి ఇప్పుడొక బలమైన నేత అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పటికిప్పుడు బలమైన నేతలు పుట్టరు కాబట్టి... ఉన్న వాళ్లలో బలాబలాలు బేరీజు వేసి డీఎల్ స్థానాన్ని భర్తీ చేయటం జరుగుతుంది. అలా మంత్రి పదవి లభించిన వ్యక్తికే జిల్లాకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించటం ఖాయం.

ఈ విషయాన్ని గుర్తించిన కడప జిల్లా నేతలు.. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ‘టచ్’ ఉన్నారు. గత కొన్ని రోజులుగా డీఎల్ ను తప్పించాలని కడప జిల్లాకు చెందిన కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేయటం తెలిసిందే. డీఎల్ బర్తరఫ్ నేపథ్యంలో డీఎల్ పై పోరాటం చేసినందుకు ఆయన పదవిని ఆశిస్తున్నారు. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక.. ముఖ్యమంత్రితో నేరుగా సంబంధాలు ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఊరించే మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నప్పుడు ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు. ప్రయత్నం చేస్తేనే కదా పదవీయోగం పట్టేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు