జ‌గ‌న్ బాగా రిసీవ్ చేసుకున్నారు-రాజ‌మౌళి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల‌పై కొత్త జీవో వ‌చ్చేసింది. పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌కు అద‌నంగా రేట్లు పెంచుకోవ‌డానికి, ఐదో షో వేసుకోవ‌డానికి కూడా అనుమ‌తులు ఇచ్చేశారు. ఇంకేముంది.. స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింది క‌దా అనుకుంటే.. వాటిలో ఏవో మెలిక‌లు పెట్టి అంత ఈజీగా ఏ ప‌ని జ‌ర‌గ‌కుండా చేస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. రాధేశ్యామ్ సినిమాకు అద‌న‌పు షోలు లేవు.

అద‌నంగా టికెట్ల ధ‌ర‌ల పెంపు కూడా లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎంను వ్య‌క్తిగ‌తంగా క‌లిస్తే త‌ప్ప త‌మ సినిమాకు ఆశించిన‌ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించి ఆర్ఆర్ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత డీవీవీ దాన‌య్య సోమ‌వారం విజ‌య‌వాడ‌కు  వెళ్లారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి వ‌చ్చారు. అనంత‌రం రాజ‌మౌళి మీడియాను కూడా క‌లిశారు.
వివ‌రంగా మాట్లాడ‌లేదు కానీ.. తాము వ‌చ్చిన ఉద్దేశం, సీఎం స్పంద‌న గురించి జ‌క్క‌న్న రెండు ముక్క‌లు మీడియాకు చెప్పి వెళ్లిపోయారు.

జ‌గ‌న్ గారు మ‌మ్మ‌ల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా మాట్లాడారు. సినిమాకు ఏవైతే చేయాలో అవ‌న్నీ చేస్తామ‌న్నారు. బాగా ఖ‌ర్చు పెట్టి తీసిన సినిమా కాబ‌ట్టి, క‌చ్చితంగా ఆ కేట‌గిరీలోకి వ‌స్తుంది కాబ‌ట్టి సినిమాకు అవ‌స‌ర‌మైనదంతా చేయ‌డానికి ప్రామిస్ చేశారు. ఈ విష‌యంలో ఆశాభావంతో ఉన్నాం. వ‌చ్చిన త‌ర్వాత కానీ దీనికి గురించి మాట్లాడ‌లేం అని రాజ‌మౌళి తెలిపాడు.

బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చారా అని మీడియా వాళ్లు అడిగితే జ‌క్క‌న్న స‌మాధానం చెప్ప‌లేదు. మ‌రి రాజ‌మౌళి, దాన‌య్య వ్య‌క్తిగ‌తంగా క‌లిసి అడిగిన నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్‌కు అయినా అద‌న‌పు షోలు, టికెట్ల రేట్ల పెంపున‌కు జ‌గ‌న్ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు ఇలా వ‌ర్క‌వుట్ అయితే.. ఇక ప్ర‌తి పెద్ద సినిమాకూ దాని టీం వెళ్లి ఏపీ సీఎంను క‌లిసి మిన‌హాయింపులు తెచ్చుకోవాలేమో