తుమ్మ‌ల టీఆర్ఎస్‌తో తెంచుకుంటారా?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మంచి ప‌ట్టున్న సీనియ‌ర్ నేత‌.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ త‌ర‌పున టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని భావిస్తున్న ఆయ‌న పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలిసింది. ఆయ‌న అనుచ‌రులు ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హించి దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఇప్పుడు వాళ్లే ఆయ‌న్ని పార్టీ మారేలా ప్రోత్స‌హిస్తున్నార‌ని తెలిసింది. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న టీఆర్ఎస్‌తో బంధాన్ని తెంచుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఆ స‌మావేశాలు

ఇటీవ‌ల మాజీ మంత్రి తుమ్మ‌త‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అనుచ‌రులు క‌లిసి సమావేశం పెట్టుకోవ‌డం స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే అధికార పార్టీలో వ‌ర్గ విభేదాలు తార‌స్థాయికి చేరాయ‌న్న చ‌ర్చ‌కు ఈ స‌మావేశం మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన తుమ్మ‌ల‌, పొంగులేటి అనుచ‌రులు త‌ల్లాడ మండ‌లంలో ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీరయ్య‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించారు. తుమ్మ‌ల‌, పొంగులేటి కీల‌క అనుచ‌రుల మ‌ధ్య ఈ భేటీ ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌కు తెలీకుండానే జ‌రిగే అవ‌కాశం లేదు. దీంతో తుమ్మ‌ల‌, పొంగులేటి క‌లిసి హైక‌మాండ్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఒప్పుకోకుంటే అంతే..
తాజాగా తుమ్మ‌ల ప్ర‌ధాన అనుచ‌రులు వంద మంది వ‌ర‌కు ఖ‌మ్మంలో స‌మావేశ‌మ‌య్యారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డి అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని, నిజ‌మైన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే తుమ్మ‌ల‌ను పాలేరు నుంచి మ‌ళ్లీ పోటీ చేయించేలా అధిష్ఠానానికి త‌మ నిర్ణ‌యాన్ని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. ఒక‌వేళ కేసీఆర్ అందుకు ఒప్పుకోక‌పోతే తుమ్మ‌ల వేరే పార్టీలోకి వెళ్లే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఆయ‌న్ని కాంగ్రెస్‌లో చేర్చుకోవ‌డం కోసం రేవంత్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిసింది. వేరే పార్టీలో చేరైనా స‌రే పాలేరులో తుమ్మ‌లో పోటీ చేసేలా క‌నిపిస్తున్నారు.

ఆ ఓటమితో..
టీడీపీతో త‌న రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తుమ్మ‌ల‌.. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి అయ్యారు. కానీ 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నేత ఉపేంద‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ త‌ర్వాత ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌డంతో తుమ్మ‌ల‌కు త‌ల‌నొప్పి మొద‌లైంది. ఇక్క‌డ గులాబి పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంతో పాటు జిల్లాలో త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌యత్నిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు పార్టీలో త‌న వ‌ర్గానికి త‌గిన గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని ఆయ‌న అసంతృప్తితో ఉన్నార‌ని ఈ కార‌ణంతోనే చాలా కాలం నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.