బీజేపీపై క‌య్యానికి కాలు దూస్తున్న బాబు

ఇన్ని రోజులు బీజేపీతో పొత్తు కోసం ప్ర‌య‌త్నించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీతో పోరుకు సై అంటున్నారా? కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై క‌య్యానికి కాలు దూస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఇన్నేళ్ల‌లో లేనిది తాజాగా ఏపీ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని టీడీపీ నేత‌లు అడ్డుకుని స‌భ‌ను బ‌హిష్క‌రించ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి బీజేపీతో తిరిగి బంధాన్ని ఏర్పరుచుకునేందుకు తెగ ఆరాట‌ప‌డ్డ బాబు.. ఇప్పుడు స‌డ‌న్‌గా ఎందుకు వ‌ద్ద‌నుకుంటున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ప్ర‌యోజ‌నం లేద‌ని..
గ‌తంలో ఒక‌సారి బీజేపీతో పొత్తు పెట్టుకున్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఆ బంధాన్ని తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఏపీలో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. జ‌గ‌న్ ధాటికి చిత్త‌య్యారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి గెలిస్తేనే త‌నకు రాజ‌కీయ మ‌నుగ‌డ ఉంటుంద‌ని ఆయ‌న‌కు తెలుసు. అందుకే బీజేపీతో దోస్తీ కోసం మ‌ళ్లీ ప్ర‌య‌త్నించారు. కానీ అటు వైపు నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రావ‌డం లేదు. పైగా బీజేపీ రాష్ట్ర నేత‌లేమో బాబుతో పొత్తు ఉండ‌నే ఉండ‌ద‌ని ఖ‌రాకండీగా చెప్పేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీకి జ‌గ‌న్ అవ‌స‌రం ఉంది. అందుకే బాబును దూరం పెడుతున్నార‌ని స‌మాచారం.

ప‌వ‌న్‌తో క‌లిసి..
ఎలాగో రాష్ట్రంలో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేదు. పైగా మోడీపై ఉన్న వ్య‌తిరేక‌త కూడా త‌న‌కు సానుకూలంగా మారొచ్చ‌ని బాబు భావిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీతో బంధాన్ని తెంచుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధంగా ఉన్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌తో క‌లిసి ఎన్నిక‌లు వెళ్లాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

అందుకే ఉన్న‌ట్లుండి ఇప్పుడు బాబు బీజేపీపై ఫైట్ మొద‌లెట్టార‌ని చెబుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకున్న టీడీపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయ‌డం బాబు ప్ర‌ణాళిక‌లో భాగ‌మేన‌ని అంటున్నారు. చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లోనే ఇదంగా జ‌రుగుతోంద‌ని స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్ను ఇలా అవ‌మాన‌ప‌రిస్తే అది కేంద్రంలోని బీజేపీకి డైరెక్టుగా త‌గులుతుంద‌ని బాబు ఆలోచ‌న‌. మ‌రోవైపు ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ స‌మావేశంలో బాబుతో పొత్తు విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలిసింది.