రాధేశ్యామ్.. ఆలస్యం అమృతం

ఒక సినిమాకు ఓ విడుదల తేదీ అనుకున్న్నాక వాయిదా పడితే.. దాన్నో ప్రతికూల సూచకంగానే భావిస్తారు మామూలుగా. అందులోనూ మూణ్నాలుగుసార్లు డేట్ మారితే.. నెలలకు నెలలు వాయిదా పడితే నెగెటివిటీ పెరుగుతుంది. ఓ భారీ చిత్రం విషయంలో ఇలా రిలీజ్ ఆలస్యం కావడం వల్ల వడ్డీల భారం పెరిగి అది కూడా నిర్మాతకు కష్టంగానే మారుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఆలస్యం అమృతం విషయం అనే సామెత వర్తిస్తుంది.

ఐతే ఇప్పుడో సినిమా విషయంలో దీనికి భిన్నంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలస్యం అమృతం విషం కాకుండా.. ఆలస్యమే అమృతం అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆ చిత్రమే.. రాధేశ్యామ్. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడటం తెలిసిందే.

జనవరి 14కు పక్కా అనుకున్నాక థర్డ్ వేవ్ కారణంగా మరోసారి ఈ చిత్రం వాయిదా పడింది.ఐతే అప్పుడు వాయిదా పడటం వల్ల ‘రాధేశ్యామ్’కు అన్ని రకాలుగా మంచే జరిగినట్లుంది. జనవరిలో దీని కంటే ముందు ‘ఆర్ఆర్‌ఆర్’ రావాల్సి ఉండటంతో అప్పుడు దీనిపై ఎవరికీ ఫోకస్ లేదు. జనాలంతా ‘ఆర్ఆర్ఆర్’ గురించే మాట్లాడుకున్నారు. ‘రాధేశ్యామ్’ను పట్టించుకోలేదు. పైగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వారానికే షెడ్యూల్ కావడంతో వసూళ్ల మీద చాలా ప్రభావం పడేది.

ఆశించిన స్థాయిలో థియేటర్లు కూడా దక్కేవి కావు. కానీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందు వస్తుండటంతో సినిమా మీద అందరి దృష్టీ నిలిచింది. మంచి హైప్ కనిపిస్తోంది. బోలెడన్ని థియేటర్లు దక్కుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో నడుస్తున్నాయి. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల సమస్య తీరిపోయింది. మామూలుగానే ఓ మోస్తరుగా రేట్లు పెరగ్గా.. తొలి పది రోజులకు ఇంకా రేట్లు పెంచుకునే అవకాశం ‘రాధేశ్యామ్’కు లభించింది. దీంతో సంక్రాంతి నుంచి వాయిదా పడటం వల్ల ‘రాధేశ్యామ్’క అన్ని రకాలుగా మంచే జరిగినట్లు అయింది.