ఇవి తేలితే.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌పై క్లారిటీ!

దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌రం ముగింపు దిశగా సాగుతోంది. ఈ నెల 10న ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. దీంతో పార్టీల భవిష్య‌త్ ఏమిట‌న్న‌ది తేలుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారాన్ని ద‌క్కించుకోబోతుంద‌న్న విష‌యంపై స్ప‌ష్టత‌ వ‌స్తుంది. అయితే ముఖ్యమంత్రుల భ‌వితవ్యాన్నే కాదు.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు తదుప‌రి రాష్ట్రప‌తిని నిర్ణ‌యించ‌డంలోనూ అత్యంత కీల‌కం కానున్నాయి. జులై 24తో ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇటు బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీయే కూట‌మి.. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మి ఈ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో స‌త్తాచాటేందుకు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి.

ఈ ఫ‌లితాల‌తో..
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆస‌క్తి పెరిగింది. ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే పార్టీల మెజార్టీని బ‌ట్టే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంటుంది. రాష్ట్రప‌తి ప‌ద‌వికి జ‌రిగే ప‌రోక్ష ఎన్నిక‌ల్లో ఓట్ల సంఖ్య కంటే కూడా ఓటు విలువ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పాల్గొనే ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌లో పార్ల‌మెంటులోని ఉభ‌య స‌భ‌ల‌కు ఎన్నికైన ఎంపీలు, అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాస‌నస‌భ్యులు ఉంటారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంలు, శాస‌న‌స‌భల్లో ఎన్డీయే కూట‌మికి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య‌ను బ‌ట్టి వారి మొత్తం ఓటు విలువ 50 శాతానికి కాస్త త‌క్కువ‌గానే ఉంది. అయినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌మ అభ్య‌ర్థిని రాష్ట్రప‌తిగా గెలిపించుకోవ‌డాన‌కి బీజేపీ పెద్ద‌గా ఇబ్బందులు ఎదురు కాక‌పోవ‌చ్చు.

కానీ అక్క‌డ ఓడితే..
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిని గెలిపించుకోవాల‌ని చూస్తున్న ఎన్డీయే కూట‌మికి ఒక‌వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ సీట్ల తేడాతో ఓడిపోతే ప‌రిస్థితి తారుమార‌య్యే అవ‌కాశం ఉంది. అప్పుడు బీజేపీకి ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. అప్పుడు ఎంపీల బ‌లం ఎక్కువ‌గా ఉన్న బిజూ జ‌న‌తాద‌ళ్‌, టీఆర్ఎస్‌, వైసీపీ లాంటి పార్టీల పాత్ర కీల‌కంగా మారుతుంది.

అయితే బీజేపీ వ్య‌తిరేక కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకోవ‌డానికి తీవ్ర కృషి చేస్తున్న నేప‌థ్యంలో ఈ సారి రాష్ట్రప‌తి ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి మెరుగైన ఫ‌లితాలు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువను చూస్తే.. యూపీ (208) లో గ‌రిష్ఠంగా ఉంది. ఆ త‌ర్వాత పంజాబ్ (116), ఉత్త‌రాఖండ్ (64), గోవా (20), మ‌ణిపూర్ (18) ఉన్నాయి. వీటిని ఆ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే సీట్ల సంఖ్య‌లో గుణిస్తే మొత్తం శాస‌న స‌భ ఓటు విలువ వ‌స్తుంది. దేశంలోనే అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్లు (403) ఉన్న యూపీ ఈ విలువ‌లో ముందు వ‌రుసలో ఉంది. కాబ‌ట్టి ఇక్క‌డ బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఆ పార్టీకి అవ‌స‌రం.