గొంతెమ్మ కోర్కెలు తీర్చి.. మమ్మల్ని కలిపేసుకోండి

గొంతెమ్మ కోర్కెలు తీర్చి.. మమ్మల్ని కలిపేసుకోండి

మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టమైన తీర్మానం చేసినప్పటి నుంచి టీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టటం లేదు. దానిపై టీడీపీ నేతల కంటే టీఆర్ఎస్ నేతలు ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పాలి. మహానాడు తీర్మానం నిర్ణయంపై ప్రజల వద్దకు చేరుకునేలోపు.. వీలైనంతగా విషయాన్ని పక్కదారి పట్టించాలని టీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారు. ఏదో రకంగా టీడీపీని దుమ్మెత్తిపోస్తూ... ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన తీర్మానం చేయలేదన్న టీఆర్ఎస్ కౌంటర్ కు... టీఆర్ఎస్ ముఖ్యనేతలు, చిదంబరంతో కలిపి  తయారు చేసిన తెలంగాణ తీర్మానం తీసుకొస్తే దానిపై మరోమాట లేకుండా తమ అధినేత చంద్రబాబునాయుడు సంతకం చేస్తారని టీడీపీ నేతలు అంతే బలంగా కౌంటర్ ఇచ్చేసరికి టీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే.. తామేమీ ఆత్మరక్షణలో పడలేదనిపించుకోవటానికి ఆ పార్టీ నేత హరీష్ రావు తాజాగా వ్యాఖ్యలు చేశారు. తాము కోరిన మూడు షరతులకు లొంగితే.. తమ పార్టీని సైతం తెలుగుదేశం పార్టీలో కలిపేస్తామంటూ బంఫర్ ఆఫర్ ఇచ్చారు.

ఇప్పటికే కాంగ్రెస్ లో తమ పార్టీని కలిపేసేందుకు ప్రయత్నించి.. చివరికి మంచి డీల్ దొరక్క దాన్ని మధ్యంతరంలో ఆపేశారు. తాజాగా హరీష్ డిమాండ్లు ఏమిటంటే.. కేంద్రం తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని.. టీడీపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం తెలంగాణ కోసమేనని, మోత్కుపల్లి, కేఎస్ రత్నం లాంటి దళిత నేతలను ముఖ్యమంత్రి చేస్తామని బాబు బహిరంగంగా ప్రకటించాలని.. ఒకవేళ అలా చేస్తే తమ పార్టీని తెలుగుదేశంలో విలీనం చేస్తామంటూ ప్రకటించారు.

ఇప్పటికే తాను అధికారంలోకి వస్తే మొదటి సంతకం గురించి చంద్రబాబు తరచూ ప్రస్తావిస్తారు. అలాంటిది ఆయన ఇప్పుడు తమ మాటను మార్చుకునే వీల్లేదు. ఇలా సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి.. వాటిని తీరిస్తే.. మేం ఇలా చేస్తామంటూ మాటలతో మాయ చేస్తుంటారు. అందుకే అంత తెంపరితనంతో హారీష్ మాట్లాడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు