కేకే ఫోకస్ దేనిపైనా..

కేకే ఫోకస్ దేనిపైనా..

కేకే అనబడే కె.కేశవరావుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎన్నికల వేళ ఎవరైనా పార్టీ మారుతున్నారంటే దానికి కారణం.. కోరుకున్న స్థానంలో టిక్కెట్టు దక్కకపోవాటమే అయి ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలు మారే జంప్ జిలానీలు అంతా కూడా... వారి మార్పిడి వెనుక పరమార్థం ఎన్నికల్లో విజయవకాశాలే. బయటకు ఎంత కొట్టిపారేసినా.. మనసులో మాత్రం ఉండేది ఇదే. తాజాగా కాంగ్రెస్ లో నుంచి టీఆర్ఎస్ లోకి చేరుతున్న వారిలో సీనియర్ నేత కేకే ఒకరు. రాష్ట్రకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన చివరికి టీఆర్ఎస్ లో చేరటంపై చాలా చర్చే జరుగుతుంది. ఆయనకు ఎంపీ సీటు, ఆయన కొడుక్కి జహారాబాద్ అసెంబ్లీ టిక్కెట్టు కోసమే ఆయన తాజాగా పార్టీ మారుతున్నారంటూ రాష్ట్రమీడియా నుంచి జాతీయ మీడియా వరకూ కోడై కూస్తుంది.

దీని ధాటికి తట్టుకోలేక కేకే ఏకంగా ఒక విలేకరుల సమావేశాన్నే ఏర్పాటు చేశారు. తాను, తన కొడుకు పోటీ చేయటం లేదని తేల్చి చెప్పారు. బతికి ఉన్నంత వరకూ తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పారు. తాను చనిపోయిన తర్వాత విషయం మాత్రం తాను చెప్పలేనని తీవ్రంగా స్పందించారు. అయినా.. తాను ఎన్నికల్లో పోటీ చేసే స్థాయిని దాటి పోయి చాలా రోజులైందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఏమైనా అయి ఉండేవాడినని... కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎవరికైనా టికెట్ ఇవ్వగలిగేవాడినని తన గురించి తాను చెప్పుకున్నారు.అంతటితో ఆగలేదు సరికదా మరికొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పుకొచ్చారు. గవర్నర్ ల నియామకంపై ఏర్పాటు చేసిన కమిటీలో నన్ను మేడమ్ సోనియాగాంధీ నియమించారు. నును గవర్నర్ గిరి ఇచ్చే స్థాయిలో ఉన్నాను. అలంటిది.. ఇప్పుడు షూ వేసుకుంటావా.. లేసు కట్టుకుంటామా అని అడగడమేమిటి? నాన్సెన్స్ అంటూ ఇంత ఎత్తున ఎగురుతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. మన పిచ్చి కానీ.. ఆయన పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఎక్కడుందని కాంగ్రెస్ నాయకులు నొసలు చిట్లిస్తున్నారు.

ఈ వ్యవహారంపై రాయలసీమకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. కేకే మాటల్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు కానీ.. పదవులు తీసుకోనని మాత్రం చెప్పటం లేదు. ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది ఎన్నికల్లో పోటీ చేశామా లేదా అన్నది కాదు.. పదవిలో ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. మీరేమో (మీడియా) ఆయన ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ.. ఆయన ఫోకస్ మాత్రం వేరే దానిపై ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు