వివేకా హత్య.. సీబీఐ నోటీసుకు నో చెప్పిన ఎంపీ అవినాశ్

గడిచిన వారం.. పది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇష్యూ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన్ను విచారించేందుకు సీబీఐ ఇచ్చిన నోటీసును తాజాగా ఆయన అంగీకరించలేదు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు 207 మందిని విచారించిన సీబీఐ మొత్తం 146 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగానికి చెందిన అధికారులతో పాటు.. పలువురు ముఖ్య అధికారులు కలిసి ఎంపీ అవినాశ్ కు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చేందుకు గురువారం పులివెందులకు చేరుకున్నారు.

తమ వద్ద విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. సీబీఐ జారీ చేస్తున్న నోటీసుల్ని స్వీకరించేందుకు అవినాశ్ .. ఆయన తండ్రి అంగీకరించలేదు. దీంతో.. సీబీఐ అధికారులు స్థానిక కోర్టును ఆశ్రయించనున్నారు. ఇందులో భాగంగా కోర్టు అనుమతి తీసుకోనున్నారు.

వివేకా హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకల్ని కడగటం.. భౌతికకాయం మీద ఉన్న గాయాలకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందితో కుట్లు వేయించి.. కట్లు కట్టించటంతో అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి పాత్ర ఉందని.. హత్య జరిగినచోట ఆధారాల ధ్వంసంలో వారు కీలకంగా వ్యవహరించారని.. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసింది కూడా వారేనని వాంగ్మూలంలో పలువురు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరిని సీబీఐ విచారణకు రావాలని కోరుతూ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైతే.. అందుకు నో చెప్పారు. దీంతో.. పులివెందుల కోర్టును ఆశ్రయించి.. కోర్డు ఆదేశాలతో నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతున్నారు.