రెండు అడుగుల దూరంలో ‘తెలంగాణ’

రెండు అడుగుల దూరంలో ‘తెలంగాణ’

వినగానే ఉలిక్కిపడే ఈ మాటపైనే ఇప్పుడు ఢిల్లీ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణపై రాష్ట్రంలో వాడీవేడీగా చర్చలు జరుగుతూ.. రాష్ట్ర ప్రజలంతా ఇంకాసేపట్లో ఏదో జరిగిపోతుందని భావిస్తూ 24గంటల న్యూస్ ఛానళ్లను అదే పనిగా చూసే సమయంలో... ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులు ఖాళీగా ఉంటారు. అదేంటి.. రాష్ట్రంలో పరిస్థితి ఇంత వేడిగా ఉంటే మీరేంటి ఇంత నిమ్మళంగా ఉన్నారంటే.. ఇక్కడ ఏదో జరిగిపోతుందని మీరు అక్కడ అనుకుంటే దానికి కూడా మాదే బాధ్యత అంటూ వ్యాఖ్యలు చేయటం మామూలే. అయితే ఈ దఫా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తెలంగాణ అంశంపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టని సమయమిది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అసెంబ్లీలో వందసీట్లు.. లోక్ సభలో పద్దెనిమిది సీట్లు అంటూ జపం చేస్తూ.. తెలంగాణ అంశాన్ని 2014 వరకూ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే.. టీఆర్ఎస్ విషయాన్ని అలా పక్కన పెట్టినా కాంగ్రెస్ అధినాయత్వం మాత్రం చాలా సీరియస్ గా ఈ విషయంపై మధనం చేస్తుందట. రాష్ట్రం ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం తెలంగాణ విషయంలో విస్పష్టంగా ఉండటం.. కేంద్ర నిర్ణయానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్న నేపథ్యంతో పాటు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర అనంతరం ఆ పార్టీ పరిస్థితి మారిన నేపథ్యంలో.. ఇదే పరిస్థితి కొనసాగించిన పక్షంలో తమకు రానున్న ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయన్న భావనలో ఉన్నారు.

అందుకే.. తెలంగాణపై తేల్చేయాలన్న ధోరణిలో అధినాయకత్వం ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ.. అనంతరం కానీ.. తెలంగాణ ప్రత్యేక ఆర్థికమండలి ప్రకటించటంపై కాంగ్రెస్ దృష్టి సారించనుంది. ఒకవేళ అది కూడా అంత ప్రభావం చూపని పక్షంలో.. ఎన్నికల సమయానికి తెలంగాణకు అనుకూలమైన ప్రకటన ఒకటి విడుదల చేసే దిశగా ఆ పార్టీ సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకటి ప్రత్యేక అర్థికమండలి లేదా ప్యాకేజీ...రెండోది తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఒక సానుకూల ప్రకటన. అందుకే తెలంగాణ ఇంకో రెండు అడుగుల దూరంలో ఉన్నట్లుగా ఢిల్లీ మీడియాలో చర్చ జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు