కలకలం...ఐబీ ఆఫీసర్ హత్య ఆప్ నేత పనే

కలకలం...ఐబీ ఆఫీసర్ హత్య ఆప్ నేత పనే

దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలో ఇంటెలిజెన్స్ అధికారిని హత్య చేసింది అక్కడి అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కౌన్సిలర్ పనేనని తేలిపోయింది. ఈ మేరకు పోలీసులు సదరు కౌన్సిలర్ పై కేసు నమోదు చేయగా... ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొత్తంగా ఈ ఘటన ఇప్పుడు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెను కలకలం రేపుతోంది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..మృతుల్లో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా ఉన్నారు. మృతుల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఉండటం... గుర్తు తెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా హతమార్చిన వైనంతో గడచిన రెండు రోజులుగా ఢిల్లీలో పరిస్థితులు మరింత విషమించినట్టుగా కనిపిస్తున్నాయి.

చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ శర్మ ఓ కాలువలో శవమై కనిపించారు. దీంతో ఒక్కసారిగా దేశరాజధానిలో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. ఈ ఘటనలో ఆప్ నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంకిత్ శర్మ హత్య కేసులో.. తాహిర్ హుస్సేన్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఐపీసీ 302 కింద (హత్యకేసు)గా దయాల్ పూర్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే... అంకిత్ శర్మ హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను తాహీర్ ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని.. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తెలిపారు.

అయితే.. చాంద్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం కేంద్రాలుగా మారినట్లు పోలీసులు పక్కా ఆధారాలను సేకరించారు. తాహిర్ నివాసం పైకెక్కిన వందలాది మంది ఆందోళనకారులు..పెట్రోల్, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలను సేకరించారు. దీంతో అంకిత్ హత్యలో తాహీర్ పాత్ర ఉందని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... తాహీర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అల్లర్లలో ఆప్ నేతల ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపిస్తే... అదే నిజమైతే... రెట్టింపు శిక్ష వేయాలంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ క్రమంలో అంకిత్ హత్యోదంతంలో తాహీర్ ప్రమేయం ఉందంటూ కేసు నమోదు కావడంతో తాహీర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేజ్రీ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English