పీకే డిమాండ్.. జగన్ అమలు

పీకే డిమాండ్.. జగన్ అమలు

నిజమా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడమేంటీ? దానిని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేయడమేంటీ? అనుకుంటున్నారా? ఏం పవన్ కల్యాణ్ అడిగితే జగన్ చేయకూడదని ఇక్కడేమైనా రూలుందా? లేదు కదా. ఓ విషయంపై గళం ఎత్తిన పవన్ తనదైన శైలి డిమాండ్ ను వినిపించారు. అదే డిమాండ్ ను పరిశీలించిన జగన్.. ఆ డిమాండ్ న్యాయమైనదేనని దానిని అమలు చేసి పారేశారు, ఇందులో పెద్ద తప్పేమీ లేదు కదా. అంతేకాకుండా ఇలాంటి పరిణామాలు.. రాజకీయాల్లో సుహృద్భావ వాతావరణాన్ని కూడా ప్రోది చేస్తాయి కదా. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగింది. సరే.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ సంగతిలోకి వెళ్లిపోదాం పదండి.

కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో అనుమానాస్పద స్థితిలో కళాశాల హాస్టల్ లోనే చనిపోయింది. బాలిక ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం చెబితే... కాదు కళాశాల యజమాని కుమారులు ప్రీతిపై అత్యాచారం చేసి ఆపై చంపేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అదే వాదనతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిగింది. నిందితులపై కేసులు నమోదయ్యాయి. వారు అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత వారు బెయిల్ పై బయటకు వచ్చారు కూడా. ఆ తర్వాతే ఈ కేసులో దర్యాప్తు దాదాపుగా అటకెక్కిందన్న వాదనలు వినిపించాయి.

ఈ క్రమంలో ఈ విషయం తన దృష్టికి రాగా పవన్ కల్యాణ్.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రీతి కుటుంబం తరఫున తాను న్యాయపోరాటం చేస్తానని ప్రకటించిన పవన్... కేసును సీబీఐకి అప్పగించేదాకా విశ్రమించేది లేదని కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఈ డిమాండ్ తోనే పవన్ ఇటీవలే కర్నూలులో పర్యటించారు.

పవన్ పర్యటన తర్వాత జగన్ కూడా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రీతి పేరెంట్స్ జగన్ ను కలిశారు. తమ కూతురును పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని జగన్ ను కోరారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్.. కేసు వివరాలను పూర్తిగా తెలుసుకుని ఫైల్ ను తనకు పంపాలని కర్నూలు ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును స్టడీ చేసిన జగన్... కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే... పవన్ డిమాండ్ చేస్తే... దానిని జగన్ అమలు చేసినట్టే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English