నువ్వా?, నేనా?.. సంక్షేమంలో కేసీఆర్, జగన్ పోటాపోటీ

నువ్వా?, నేనా?.. సంక్షేమంలో కేసీఆర్, జగన్ పోటాపోటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఇప్పుడు నిజంగానే ఆసక్తికర పోటీ సాగుతోందని చెప్పక తప్పదు. ఈ పోటీ... ఒకరిని ఒకరు తొక్కేసుకోవడంలో కాకుండా ప్రజలకు సరికొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడంలోనే సాగుతోందని కూడా చెప్పక తప్పదు. రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నా కూడా ఈ ఇద్దరు సీఎంలు... ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాల ప్రారంభం, అమలులో పోటాపోటీగా దూసుకెళుతున్నారు.

ఇప్పటికే ఇద్దరు సీఎంలు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా.... కాకతాళీయమో, ఏమో తెలియదు గానీ... ఇద్దరు సీఎంలు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేందుకు   గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కొత్తగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తీర్మానించారు. గురువారం నాడు ఆరోగ్య శాఖ సమీక్షలో బాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిందేనన్న మాటను చెప్పిన జగన్... ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేసే దిశగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

24 గంటల పాటు తెరిచే ఉండే ఈ క్లినిక్ లలో నిత్యం బీఎస్సీ నర్సింగ్ విద్యనభ్యసించిన నర్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని తీర్మానించేశారు. అంతేకాకుండా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న వీటిని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని కూడా జగన్ తీర్మానించారు. ఈ పథకానికి ‘డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు’ అనే పేరును జగన్ పెట్టేశారు.

జగన్ కొత్త సంక్షేమపథకాన్ని ప్రకటించిన గురువారమే తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ కూడా మరో కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘కేసీఆర్ ఆపద్బంధు’ పేరిట త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్న ఈ పథకం కింద ఎంబీసీ కేటగిరీ చెందిన ఐదుగురు యువకులను ఓ గ్రూప్ గా ఏర్పాటు చేసి వారికి ఓ అంబులెన్స్ ను పంపిణీ చేస్తారట. తొలుత పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున ఈ యూనిట్లను ప్రారంభిస్తారట.

ఇదే పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది మహిళలకు కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారట. ఇక చదువుకున్న యువతులకు నిఫ్ట్ లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తారట. అంతేకాకుండా 11 ఫెడరేషన్ల ద్వారా కుల వృత్తుల్లో ఆయా కులాల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారట. మొత్తంగా రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ లు ఒకే రోజు ఇలా కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించడంతో సంక్షేమంలో ఇద్దరు సీఎంలు పోటీ పడుతున్నారన్న ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English