బాబు ఇంతగా ఇబ్బంది పడినా... గంటా కనిపించలేదే

బాబు ఇంతగా ఇబ్బంది పడినా... గంటా కనిపించలేదే

టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు గురువారం నాడు విశాఖలో తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించేందుకు చంద్రబాబు వస్తే... విమానాశ్రయం నుంచి అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో దాదాపు రెండు గంటలకు పైగా కారులోనే బాబు కూర్చోగా.. ఆ తర్వాత బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని తిరిగి హైదరాబాద్ ప్లైట్ ఎక్కించేశారు.

మొత్తంగా చంద్రబాబు రౌండప్ అయిపోతే... ఆయనకు అండగా నిలవాల్సిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఆ దరిదాపుల్లోనే కనిపించలేదు. బాబుకు అండగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన చాలా మంది నేతలు, విజయవాడ నుంచి మరికొందరు కీలక నేతలు కదిలివచ్చినా... స్థానికంగా ఉన్న గంటా మాత్రం అడ్రెస్ కనిపించలేదు. దీనిపై ఇప్పుడు ఆసక్తికర చర్చే మొదలైంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమిపాలైన టీడీపీతో... వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ విజయఢంకా మోగించిన గంటా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. పార్టీకి దూరంగా ఉంటున్న గంటా అటు బీజేపీలోకో, లేదంటే ఏకంగా ఇటు వైసీపీలోకో చేరిపోవడం ఖాయమని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, అదే సమయంలో టీడీపీని వీడే ప్రసక్తే లేదని కూడా గంటా తేల్చి చెప్పేశారు.

దీంతో ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖలో టీడీపీకి ఎలాంటి షాకులు తగలవన్న ధీమాతో పార్టీ నేతలు కనిపించారు. అయితే విశాఖలో ఎగ్గిక్యూటివ్ కేపిటల్ పెడతామంటూ జగన్ సర్కారు చేసిన ప్రకటన దరిమిలా గంటా చాలా వెరైటీగా స్పందించారు. విశాఖకు రాజధాని వస్తుందంటే.. విశాఖ వాసిగా తాను జగన్ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తానని కూడా గంటా చెప్పేశారు.

ఇదంతా బాగానే ఉన్నా... ఉత్తరాంధ్ర పర్యటన అంటూ గురువారం చంద్రబాబు విశాఖ వస్తే.. స్థానిక ఎమ్మెల్యేగా బాబుకు స్వాగతం చెప్పేందుకైనా గంటా విమానాశ్రయానికి వచ్చి ఉండాల్సింది. అంతేకాకుండా బాబు పర్యటనను అడ్డుకుని తీరతామంటూ వైసీపీ చేసిన ప్రకటన నేపథ్యంలో బాబుకు అండగా నిలిచేందుకైనా గంటా ఎయిర్ పోర్టుకు వచ్చి ఉండాల్సింది. సరే... ఏదో వ్యక్తిగత పని నిమిత్తం బాబు పర్యటనకు దూరంగా ఉండక తప్పని పరిస్థితులు ఉన్నా... తన పార్టీ అధినేతను వైసీపీ వర్గం అష్టదిగ్బంధనం చేసిందన్న వార్తలు విన్న తర్వాతైనా, బాబు పర్యటనతో విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొందన్న వార్త చూశాకైనా గంటా ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి.

అయితే ఇవేవీ పట్టని గంటా... అసలు బాబు వద్దకు వెళ్లలేదు. దీంతో వైసీపీ మాదిరే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న బాబు టూర్ కు వ్యతిరేకంగానే గంటా అక్కడకు వెళ్లలేదా? అన్న దిశగా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English