గొడవలు వాయిదా వేసిన ముఖ్యమంత్రి !

గొడవలు వాయిదా వేసిన ముఖ్యమంత్రి !

మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరగలేదు? ఎందుకు వాయిదా పడింది? ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వదిలేసి దాదాపు అరవై గంటలపైనే హస్తినలో కూర్చున్నా ఆయన మాటల్ని అధిష్ఠానం ఎందుకు ఒప్పుకోలేదు? తాజా పరిణామాలు చూసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. ఇంతకీ విస్తరణ వాయిదా వేయటానికి కారణం.. అనవసరమైన రణం(యుద్ధం) జరగకుండా ఉండటానికే. ఇప్పటికే ఇద్దరు మంత్రుల (సబిత, ధర్మాన)ను మంత్రి పదవుల నుంచి సాగనంపిన విషయం తెలిసింది. ఆ జాబితాలో మరికొందరు ఉన్నారు. ఆరోపణలు ఉన్న వారి విషయంలో ఏం చేయాలా? అని కాంగ్రెస్ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముందే తప్పుకోమని చెప్పాలా? లేక.. మరికొంత కాలం వేచి చూడాలా? అన్న విషయంపై భారీ చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ముందే తప్పుకోమంటే.. పదవులు కోల్పోతున్న వారు ఖాళీగా కూర్చోరు కదా.. అధికారంలో ఉండి కూడా తమను కాపాడకుండా ఫిక్స్ చేయటాన్ని ఎవరు మాత్రం ఊరుకుంటారు. ఆవేశంతో ఇలాంటి వారు మరికొందరిని జత కలుపుకొని యుద్ధం ప్రకటిస్తే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అసలే ఇలాంటి పరిణామం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ చాలా ఆశగా ఎదురుచూస్తోంది. అందుకే ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా.. మొదటికే మోసం వస్తుందేమోనన్న సందేహం కాంగ్రెస్ వర్గాలను పట్టి పీడిస్తోంది.

ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. అలాంటి ప్రమాదం పొంచి ఉంటుందన్న భయాన్ని ఢిల్లీ పెద్దలు కిరణ్ వద్ద వ్యక్తం చేసుతన్నారు. అయితే.. అలాంటిదేమీ జరగన్న భరోసాను కిరణ్ ఇస్తున్నా.. ఈ విషయంలో ఆయన మాటల్ని విశ్వసనీయతలోకి అధినాయకత్వం తీసుకోవటం లేదన్నది ఒక వాదన. అందుకే.. మంత్రివర్గ విస్తరణ కోసం పలుమార్లు చర్చకు వచ్చినా.. అంతిమంగా నిర్ణయం తీసుకోవటంలో మాత్రం మరికొంత కాలం వేచి చూడాలన్న తుది నిర్ణయానికి వచ్చింది.