కిరణ్ పార్టీతో నష్టం ఎవరికి

కిరణ్ పార్టీతో నష్టం ఎవరికి

మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీతో ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అన్న టాక్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత కాలం ఆయన పార్టీ పెడతారా, పెట్టరా, ఇక ఆయన పార్టీకి మంగళం పాడినట్టే అన్న రకరకాల వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. ఆ అనుమానపు తెరలను దించుతూ కిరణ్ స్వయంగా తాను పార్టీని పెట్ట బోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 న రాజమండ్రిలో  తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, అందులో విధివిదానాలు ప్రకటిస్తానన్నారు. దీంతో ఇక ఆయన పార్టీ వస్తుందన్నది నిజం.. అందుకే ఈ చర్చ.

కిరణ్ కుమార్ రెడ్డి పెడుతున్న పార్టీ సీమాంద్రకోసం, అంటే ఆయన పార్టీ సీమాంద్ర రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలలో ఏదో ఒకదానికి నష్టం, ఇంకో దానికి లాభం జరగాలి, లేదా అన్ని పార్టీలు నష్టపోయి కిరణ్ పార్టీ గెలవాలి. వీటిలో దేనికి ఎక్కువ అవకాశం ఉందన్నది అసలు ప్రశ్న. సరే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి అదేంటో ఓ సారి పరిశీలిద్దాం. ముందుగా కిరణ్ పార్టీ ఎవరికి నష్టం కలిగిస్తుందో పరిశీలిస్తే... బయట వినిపిస్తున్న వాదనలు బట్టి కిరణ్ కేవలం సమైక్యం అది కూడా సీమాంద్రకు లబ్ది చెందడం అనేది ప్రధాన ఎజెండా. ఇదే ఎజెండాతో వైకాపా సీమాంద్రలో ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది.

అయితే రాష్ట్ర విడిపోయిన తర్వాత పరిస్తితులు మారాయి. ఇప్పడు వైకాపా కూడా సమైక్యం అంటే హోల్ ఆంధ్రప్రదేశ్ అంటూ కొత్త పాటను అందుకుంది. ఇది వైకాపా పై వందశాతం సీమాంద్ర వాదం అన్న ముద్రను కొంత మేర తగ్గిస్తుంది. ఇక కిరణ్ వంద శాతం సమైక్యం అంటూ సీమాంద్ర అన్నారు కాబట్టి సమైక్యవాదులు కిరణ్ వైపుకు మొగ్గు చూపవచ్చేమో. అదే జరిగితే ఈ కోణంలో కిరణ్ వల్ల జగన్ కు కొంత నష్టం. ప్రాంతీయ వాదాలను పక్కన బెట్టి ఇతర కారణాలను పరిశీలిస్తే పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసేవి కులాలు, వర్గాలు.

ఈ కోణంలో చూస్తే సీమాంద్రలో బలంగా ఉన్న కాపు వర్గం టిడిపి వైపుకు మొగ్గు చూపుతోంది. కారణం వైకాపా పై రెడ్డి వర్గం పార్టీ, అది వారికే ప్రాధాన్యత ఇస్తుంది అన్న ముద్ర ఉంది కాబట్టి. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఇప్పటి వరకు జగన్ వెంటనే పూర్తిగా ఉందనుకుంటున్న రెడ్డి వర్గంలో కొంత కిరణ్ కుమార్ రెడ్డి వైపు మళ్ల వచ్చు. ఈ కోణంలో చూసుకున్నా కూడా జగన్ కే నష్టం అన్న వాదన వినిపిస్తోంది. ఈ రెండు కోణాల్లో  టిడిపిని పరిశీలిస్తే...సీమాంద్రలో బలమైన కాపు వర్గం అంతా తనవైపుకు తిప్పుకుని, కేవలం రెడ్డి వర్గంపైనే పూర్తిగా ఆదారపడ్డ ప్రధానప్రత్యర్థి వర్గం చీలిపోతుంది కాబట్టి కిరణ్ వల్ల జగన్ కు నష్టం, చంద్రబాబుకు లాభం అన్న వాదన వినిపిస్తోంది.

కాని చంద్రబాబు సీమాంద్రకు ద్రోహం చేసారు, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు, ఇప్పుడు కూడా తెలంగాణ, సీమాంద్ర రెండు నాకు సమానం అంటున్నారు కాబట్టి విభజన విషయంలో గుర్రుగా ఉన్న సీమాంధ్రులు వర్గ, కులాల కోణంలో చూడకుండా విభజనకు అనుకూలం అన్న నెపంతో చంద్రబాబును దూరంగా ఉంచుతారు అన్న భావం అంతో ఇంతో ఉంది. ఈ నేపథ్యంలో సమైక్యవాదులు చంద్రబాబును కాదనడం వల్లనే జగన్ కు సీమాంద్రలో ఏ సర్వేలో చూసినా కూడా జనం జేజేలు కొడుతున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబుకు సీమాంద్రలో విభజన వల్ల నష్టమేమి లేదు, ఇక మన రాష్ట్రంలో అభివృద్ది జరగాలి అనుకుంటున్న వారి మద్దతే ఉందన్నది స్పష్టం.

అయితే కిరణ్ రావడం వల్ల ఈ ఓటర్లలో మార్పు రాదు, వారంతా చంద్రబాబు వైపే ఉంటారు, ఇక సమైక్యం అంటూ పచ్చి సమైక్యవాదులను తన వైపుకు తిప్పుకున్న జగన్ కే ఆయనతో సమానంగా సమైక్యవాదం వినిపించిన కిరణ్ తిప్పుకుంటారు, ఇలా చూసినా కూడా కిరణ్ వల్ల జగన్ కే నష్టం అన్న వాదన వినిపిస్తోంది. పోని కిరణ్ కే పూర్తి సమైక్యవాదం క్రెడిట్ దక్కి వారి ఓట్లన్నీ కిరణ్ పార్టీకి పడి ఆయన గెలుస్తాడా అన్నది మరో వాదన. అయితే దీనికి అవకాశం లేదంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే ఆయన సమైక్యం ముసుగులో విభజనకు సహకరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన సమైక్యం కోసం అసలైన సమయంలో రాజీనామా చేసి ఆపకుండా అంతా కానిచ్చి ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం సోనియా ఆదేశాల మేరకు కాంగ్రెస్ కే మేలు చేసేందుకు పార్టీ పెడుతున్నారన్న భావన కూడా కొంత ఉంది. ఇవేవి నిజం కాకపోయినా ఆయన పక్కా సమైక్యవాది, ఆయన వెంటే మేముంటాం అన్న వారిలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన మోసం చేసాడంటూ టిడిపి లో చేరారు. దీని ప్రభావం కూడా ఆయనపై వస్తున్న ఆరోపణలకు ప్రజల్లో బలాన్ని చేకూరుస్తుంది. పైగా ఇప్పుడు కిరణ్ వెంట కాంగ్రెస్ నుంచి బహిష్కృతులైన అయిదారుగురు ఎంపీలు, ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప మరెవరు కనిపించడం లేదు. ఇంత తక్కువ బలంతో సీమాంద్రలో అన్ని స్థానాల్లో అభ్యర్థులనే నిలబెట్టలేరు, ఎవరినో ఒకరిని నిలబెట్టినా వారిని గెలిపించుకొని ఏకంగా అధికారంలోకి రావడం మాత్రం కష్టమే అన్న వాదన మెజారిటి వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే కిరణ్ వల్ల జగన్ కు నష్టం, బాబుకు లాభం అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English