మోదీకి నచ్చేలా ప్రసంగించిన ట్రంప్

మోదీకి నచ్చేలా ప్రసంగించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియం మోతెక్కిపోయింది. లక్షా 25 వేల మంది హాజరైన ఈ సభను చూసి, తనకు దక్కిన భారీ స్వాగతాన్ని చూసి ట్రంప్ తెగ ఆనందపడిపోవడం కనిపించింది. ఆ ప్రభావంతోనో ఏమో ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు ట్రంప్. 2014 ఎన్నికల ముందు తనను తాను ఆమ్ ఆద్మీగా ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో మోదీ తీసుకొచ్చిన చాయ్‌వాలా ఇమేజ్‌ను ట్రంప్ కూడా ప్రజలకు గుర్తుచేశారు. అంతేకాదు.. మోదీ పాలనతో భారత్ ఉరకలేస్తోందని ట్రంప్ పదేపదే చెప్పారు.

ట్రంప్ ప్రసంగం మోదీకి భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ పర్యటనలో తొలి గంటలే దేశాన్ని, ప్రపంచాన్ని ఆకర్షించడంతో ఆయన 36 గంటల పర్యటనపై మరింత ఆసక్తి ఏర్పడింది.

సాయంత్రం ట్రంప్ ఆగ్రాను సందర్శించనుండడంలో అక్కడ ఎలాంటి హడావుడి ఉంటుంది.. ఏమేం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు భారత పర్యటనకు వచ్చిన ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఆగ్రాను సందర్శించారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఆగ్రాను సందర్శిస్తున్నారు.

అనంతరం రాత్రికి దిల్లీలో ఏర్పాటుచేసిన విందులోనూ మోదీ షో కనిపించబోతోంది. సొంత పార్టీకి చెందిన కొందరు సీఎంలు, ఇంకొందరు తటస్థ సీఎంలతో పాటు కేసీఆర్ వంటివారినీ పిలవడంతో అక్కడ వారందరి ముందు అగ్రరాజ్యాధినేత వద్ద తన స్థాయేంటో చూపించబోతున్నారు. మొత్తానికి ట్రంప్ పర్యటనతో మోదీకి ఇంటాబయటా తన పాపులారిటీని మరింత పెంచుకుంటున్నారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English