సిట్ పై బాబు స్పందన... వృధా ప్రయాసేనట

సిట్ పై బాబు స్పందన... వృధా ప్రయాసేనట

నవ్యాంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన సాగిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై దర్యాప్తు చేస్తామంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిన్న వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)పై పెను కలకలమే రేగింది. ఎప్పటిలానే తమను టార్గెట్ చేస్తూనే ఈ సిట్ వేశారని టీడీపీ ఆరోపిస్తుంటే... తప్పు చేయనప్పుడు సిట్ వేస్తే ఉలిక్కిపడతారెందుకు అన్నట్లుగా వైసీపీ వాద ప్రతివాదనలు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేరుగానే జగన్ సిట్ పై స్పందించారు. సూటిగా, సుత్తిలేకుండా చంద్రబాబు స్పందించేశారు. అసలు ఈ సిట్ లు తననేమీ చేయలేవని, ఇలాంటి వాటిని చాలానే చూశానని కూడా అలాఅలా సిట్ ను తీసిపారేశారు.

ట్విట్టర్ వేదికగా శనివారం సాయంత్రం సిట్ పై స్పందించిన చంద్రబాబు వరుస ట్వీట్లలో దానిపై స్పందించారు. ఆ ట్వీట్లలో చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే... ''ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్త కాదు. 9 నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు.''

''అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు?'',

''ఇప్పుడీ జీవో 344 వైసిపి వేధింపులకు పరాకాష్ట. గత 5ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి?'', '' వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే!  రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం.'',  

''సిట్ నే పోలీస్ స్టేషన్ గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే. టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు.'' అంటూ సదరు ట్వీట్లలో చంద్రబాబు స్పదించారు.

మొత్తంగా తనపై గతంలోనూ చాలా మంది కుట్రలు పన్ని కేసులు పెట్టేందుకు యత్నించారని చెప్పిన చంద్రబాబు... జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్ది ఏకంగా 26 దర్యాప్తులు చేయిస్తే.. ఒక్కదానిలో కూడా తన తప్పు దొరకలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరే ఇప్పుడు జగన్ కూడా తనపై దర్యాప్తులు, విచారణలు అంటూ హడావిడి చేస్తున్నారని, అయితే ఎక్కడ కూడా తాను అవినీతికి పాల్పడిన దాఖలా లేదని, దీంతో ఇప్పుడు కూడా జగన్ తనను ఏమీ చేయలేరని చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English