కేసీఆర్ సారూ.. ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు

కేసీఆర్ సారూ.. ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు

గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద పనే పెట్టేస్తున్నారు. ఎప్పుడూ పార్టీ, పార్టీ అధినేత హవాతోనే ఎమ్మెల్యేలుగా గెలిచి ఫోజు కొట్టాలనుకుంటే సరిపోదు. నిజమే మరి... ఎప్పుడూ తమ హవాతో పనిలేకుండా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ పోతే... ఆ తర్వాత నియోజకవర్గాల వైపే కన్నెత్తి చూడకుంటే... పార్టీ భవిష్యత్తు ఏం కావాలి? పార్టీని నియోజకవర్గాల్లో చంపేసుకుని మరోమారు గెలిపించమని పోటీ చేస్తే లాభమేముంది? అందుకే... పార్టీ హవాతో ఎమ్మెల్యేలుగా గెలిచిన గులాబీ నేతలకు కేసీఆర్... ఏకంగా ప్రోగ్రెస్ కార్డులను జారీ చేస్తారట. ఈ కార్డుల్లో 'ప్రోగ్రెస్' కనబరిస్తే తప్పించి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవంట. నిజమా? అంటే... పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్న కేసీఆర్,... చాలా మంది పెర్ ఫార్మెన్స్ పూర్ గా ఉందని తెలుసుకున్నాక ఇదే నిర్ణయం తీసుకున్నారట.

ఎప్పుడు సమీక్షలు పెట్టినా... పనితీరు మెరుగుపరచుకోవాలని, అందులో భాగంగా నియోజకవర్గాల వైపు ప్రత్యేక దృష్టి సారించాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెబుతూనే వస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలను కొందరు ఎమ్మెల్యేలు పాటిస్తున్నా.. మెజారిటీ నేతలు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదట. తమకు కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉన్నారని, పార్టీ అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయని, ఈ రెండే తమను విజయతీరాలకు చేరుస్తాయని భావిస్తున్న చాలా మంది ఎమ్మెల్యేలు... అసలు తమ నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడటం లేదట. దీంతో ఆ ఎమ్మెల్యేల గెలుపు అవకాశాలు ఎలా ఉన్నా... సదరు నియోజకవర్గాల్లో పార్టీ పరువు గంగలో కలుస్తోందట. దీనికి మందు వేయాలని భావించిన కేసీఆర్... ప్రోగ్రెస్ కార్డులంటూ చక్కటి ఉపాయాన్ని ఎంచుకున్నారట.

త్వరలో జరిగే పార్టీ ఎమ్మెల్యేల సదస్సులో ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్న కేసీఆర్.. పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలకు ఓ ఆరు నెలల పాటు గడువు ఇచ్చి... ఆ తర్వాత ప్రోగ్రెస్ కార్డులను ఇస్తారట. ఒక్కసారి ప్రోగ్రెస్ కార్డులు జారీ అయితే... ఎమ్మెల్యేలు  ఎవరైనా సరే పాస్ మార్కులు వేయించుకుని తీరాల్సిందేనట. ప్రోగ్రెస్ కార్డుల్లో పాస్ మార్కులు రాకుంటే వచ్చే ఎన్నికల్లో సదరు ఎమ్మెల్యేలకు టికెట్ల జారీ ఉండదట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు కాస్తంత ముందుగానే వెల్లడించి మరీ ప్రోగ్రెస్ కార్డులు జారీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రోగ్రెస్ కార్డుల ప్లాన్ అయితే బాగానే ఉంది గానీ... మరి దీనిని గులాబీ ఎమ్మెల్యేలు ఏ రీతిన పరిగణనలోకి తీసుకుంటారన్నదే అసలు సమస్యగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English