నల్లారికి కాంగ్రెస్ పదవి... మాజీ సీఎంకు సరిపోతుందా?

నల్లారికి కాంగ్రెస్ పదవి... మాజీ సీఎంకు సరిపోతుందా?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించిన ఏపీ శాఖకు కొత్తగా జవసత్వాలు నింపే పనిని భుజానికెత్తున్న ఏఐసీసీ... ఏపీపీసీకి జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈ కమిటీలో ఉన్నవారంతా దాదాపుగా జనాలకు పరిచయం లేని వారే అయినా... అందులో ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా సభ్యుడిగా నియమిస్తూ ఏఐసీసీ మరింత సంచలన నిర్ణయం తీసుకుంది. కో-ఆర్డినేషన్ కమిటీ పేరిట ఏర్పాటు చేసిన ఈ కమిటీకి పీసీసీ చీఫ్ హోదాలో సాకే శైలజానాథ్ చైర్మన్ గా వ్యవహరిస్తారట. ఆ కమిటీలోనే నల్లారిని ఓ సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

సదరు కమిటీ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీసీసీకి ఆఫీస్ బేరర్స్ జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. జాబితాలో 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు, 29 మందితో కో ఆర్డినేషన్, 18 మంది జిల్లాల అధ్యక్షులు (కార్పొరేషన్ ఉన్న నగరానికి ఓ అధ్యక్షుడు, మిగిలిన జిల్లాకు రూరల్ అధ్యక్షుడు), 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. కో ఆర్డినేషన్ కమిటీకి చైర్మన్‌గా సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. ఆ కమిటీలో సభ్యుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి చోటు ఇచ్చింది. సీఎంగా పనిచేసిన నేతకు ఈ పదవి చాలా చిన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదంతా బాగానే ఉన్నా... సీఎంగా పనిచేసిన నల్లారికి కొత్తగా ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ కమిటీలో కీలక భూమిక పోషించేలా ఏదో కీలక పదవిని కేటాయిస్తే బాగుంటుందేమోనన్న వాదన వినిపించినా... సదరు వాదనలను ఏమాత్రం పట్టించుకోని ఏఐసీసీ.. నల్లారికి కేవలం కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడితో సరిపెట్టేసింది. అయితే... తెలుగు నేల విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టినా.. .పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. అయితే రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా కనిపించని నల్లారి... దాదాపుగా రాజకీయ సన్యాసం చేశారా? అన్న అనుమానాలు రేకెత్తాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ... నల్లారిని ఓ మోస్తరు యాక్టివేట్ చేస్తూ ఆయనను కో-ఆర్డినేషన్ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English