జగన్ సంచలనం... చంద్రబాబుకు భద్రత కుదింపు

జగన్ సంచలనం... చంద్రబాబుకు భద్రత కుదింపు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భద్రతను కుదిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక... టీడీపీ నేతలకు కొనసాగిస్తున్న భద్రతను కుదించుకుంటూ వస్తున్న జగన్ తాజాగా చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతను కూడా తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాబుకు భద్రతను కుదిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రబాబు ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రాణహాని ముప్పు పొంచి ఉన్న నేతలకు మాత్రమే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఈ తరహా భద్రతను ఎవరెవరికి ఇవ్వాలన్న విషయాన్ని నిర్ధారిస్తుంది.

అయితే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం భద్రతను ఒకేసారి భారీగా కుదించడం పెను సంచలనంగానే మారిందని చెప్పక తప్పదు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ఎస్పీజీకి చెందిన సాయుధ కమెండోలు భద్రతా వలయంగా నిలుస్తున్నారు. ఎస్పీజీ కమెండోలను ఎంతమందిని ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే. ఈ క్రమంలో ఎస్పీజీ కమెండోల సంఖ్యను పక్కనపెట్టేసిన జగన్ సర్కారు... జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రముఖులకు ఎస్పీజీ కమెండోలకు అదనంగా స్థానిక పోలీసులను కేటాయిస్తారు.

ప్రస్తుతం చంద్రబాబుకు ఎస్పీజీ కమెండోలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 146 మంది పోలీసులను భద్రత కోసం కేటాయించింది. ఈ సంఖ్యను జగన్ ప్రభుత్వం ఒకేసారి 67కు కుదించేసింది. అంటే... చంద్రబాబు భద్రతకు వినియోగిస్తున్న స్థానిక పోలీసుల సంఖ్యను ఒకేసారి 79 మేర తగ్గించేసిందన్న మాట.

గతంలో సీఎంగా ఉన్న సమయంలో తిరుమల వెళుతున్న చంద్రబాబును టార్గెట్ చేసిన నక్సలైట్లు అలిపిరి వద్ద క్లెమోర్ మైన్ పేల్చారు. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో చంద్రబాబు బయటపడగా... అప్పటి నుంచి చంద్రబాబు భద్రత విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి.

అయితే ఇప్పుడు జగన్ సర్కారు.. చంద్రబాబు భద్రతను ఒకేసారి భారీగా కుదించేయడం సంచలనంగా మారింది. అంతేకాకుంగా ప్రజా చైతన్య యాత్రకు బాబు సిద్ధమైపోయారు. ఇలాంటి కీలక తరుణంలో బాబు భద్రతను భారీగా కుదించేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు గురయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English