బీజేపీకి గంటా షాక్... మామూలుగా లేదుగా

బీజేపీకి గంటా షాక్... మామూలుగా లేదుగా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిజంగానే సత్తా ఉన్న నేత కిందే లెక్క. ఎక్కడ కూడా రెండో పర్యాయం బరిలోకి దిగకుండా... నిలిచిన ప్రతిసారీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కుంటూ విజయబావుటా ఎగురవేస్తున్న గంటా... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు గట్టి షాకే ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమితో గంటా ఆ పార్టీని వీడతారని, అయితే వైసీపీ.. లేదంటే బీజేపీలో ఆయన చేరిపోతారని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ గంటా... ఏకంగా బీజేపీకి చెందిన శ్రేణులను టీడీపీలోకి లాగేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గంటా... టీడీపీకి ఎదురుగాలి వీచినా సత్తా చాటి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే అన్ని పార్టీల్లో తన మిత్రులను కలిగి ఉన్న గంటా... హైదరాబాద్ వెళితే బీజేపీలో చేరిన సుజనా చౌదరితో.. విశాఖ, అమరావతి వస్తే... ఏపీ మంత్రి కొడాలి నానితో రాసుకుపూసుకు తిరిగారు. ఈ క్రమంలో సుజనా అండ్ కో మాదిరే గంటా కూడా బీజేపీలో చేరిపోవడం ఖాయమని, లేదంటే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని, ఏది జరిగినా అంతా లాంఛనమేనంటూ వినిపించిన వార్తలు ఆసక్తి రేకెత్తించాయి.

ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసిన గంటా.... ఆదివారం తన నియోజకవర్గంలోని బీజేపీకి చెందిన 300 మంది నేతలు, కార్యకర్తలను టీడీపీలోకి లాగేశారు. తన మాట మేరకు టీడీపీలోకి చేరేందుకు వచ్చిన వారందరికీ పచ్చకండువా కప్పేసిన గంటా ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఈ చేరికలు ఇటు బీజేపీకి భారీ షాకివ్వగా... అధికార వైసీపీకి కూడా ఓ రేంజిలో షాక్ తగిలిందనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటే దిశగానే ఈ చేరికలు జరిగాయని, త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయంటూ గంటా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English