పీకే విత్ షా... హైదరాబాద్ లో భారీ సభ

పీకే విత్ షా... హైదరాబాద్ లో భారీ సభ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జనసేన పొత్తు ఇప్పటికీ ఓ లెక్కాపత్రం లేని జట్టు కిందే లెక్క. అప్పుడెప్పుడో ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్... కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న బీజేపీ నెంబర్ టూ పవర్ సెంటర్ అమిత్ షాతో భేటీతోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచిందని ఇరువర్గాలు తేల్చేశాయి. అయితే బహిరంగంగా ఇరు పార్టీలు కలిసి నడిచిన సందర్భం ఇప్పటిదాకా లేదనే చెప్పాలి.

అయితే ఆ ముహూర్తం కూడా రానే వచ్చిందని చెప్పాలి. వచ్చే నెల 14న అటు బీజేపీ నుంచి అమిత్ షా, ఇటు జనసేన నుంచి పవన్ కల్యాణ్... ఇద్దరూ ఒకే వేదిక మీద కలిసి కనిపించనున్నారు. అంతేనా... ఇరు పార్టీలు కూడా ఒకే నినాదంతో ముందుకెళుతున్నట్లుగా సదరు వేదిక మీద నుంచే రెండు పార్టీలు ప్రకటించనున్నాయి.

ఈ కీలక పరిణామానికి వేదికగా నవ్యాంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక ప్రాంతం కాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక మారింది. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ నుంచి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, ఇదే సభకు విశిష్ట అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఈ మేరకు ప్రకటనలు వచ్చాయి.

సీఏఏకు అనుకూలంగా బీజేపీ నిర్వహిస్తున్న ఈ సభకు... సీఏఏకు మద్దతు పలుకుతున్న పార్టీగా జనసేన హాజరవుతోంది. అటు అమిత్ షా వస్తుండటంతో బీజేపీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా, పవన్ హాజరవుతున్న ఈ సభకు జనసైనికులు కూడా భారీ సంఖ్యలోనే తరలిరానున్నట్లుగా సమాచారం.

ఇంతదాకా బాగానే ఉన్నా... తెలంగాణలో పట్టు కోసం బీజేపీ నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా కమలనాథులకు బాగానే ఉపయోగపడనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ సెంట్రిక్ గా పాలిటిక్స్ నెరపుతున్న పవన్ కల్యాణ్... తెలంగాణలో జరిగే ఈ సభకు హాజరవడం ద్వారా జనసేనకు ఏ మేర ఉపయోగమన్నది తేలాల్సి ఉంది.

ఇప్పటిదాకా తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కూడా పవన్ వాటికి దూరంగానే ఉన్నారు. అదే ఏపీ విషయానికి వస్తే.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడినట్లుగా కనిపించారు. అయితే ఫలితాలు పూర్తిగా పేలవంగా రావడంతో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అమిత్ షాతో కలిసి పవన్ కదం తొక్కే కార్యక్రమం ఏపీలోని ఏదో ఒక ప్రాంతంలో జరిగి ఉంటే... బాగుండేదని జనసైనికుల భావనగా తెలుస్తోంది. మరి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సభలో అమిత్ షాతో కలిసి కనిపించనున్న పీకే... జనసైనికులను ఏ మేర ఉత్సాహపరుస్తారో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English