రాజ్యసభకు పంపే నలుగురిలో ముగ్గుర్ని ఫైనల్ చేసిన జగన్?

రాజ్యసభకు పంపే నలుగురిలో ముగ్గుర్ని ఫైనల్ చేసిన జగన్?

త్వరలో రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని భర్తీ చేసే వీలుంది. ఇందులో ముగ్గురిని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరంగా మారిన జగన్ ఎంపికను చూస్తే.. విధేయత.. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికే పదవులు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారన్న భావన కలగటం ఖాయం.

ఇప్పటికే డిసైడ్ చేసిన ముగ్గురిలో ఇద్దరు పొలిటిషియన్లుగా మారిన పారిశ్రామికవేత్తలు అయితే.. మరొకరు మాత్రం ఏపీలో మంత్రిగా వ్యవహరిస్తున్న నేతగా చెబుతున్నారు. రాజ్యసభకు జగన్ డిసైడ్ చేసిన ముగ్గురిలో మొదటి పేరు రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డిగా తెలుస్తోంది. పలు సంస్థలకు అధినేతగా చెప్పే ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీకి దిగలేదు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు సొంత సోదరుడైన అయోధ్యరామిరెడ్డి మొదట్నించి జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. తాజాగా ఆయన్ను రాజ్యసభకు పంపటం ద్వారా.. ఇన్నాళ్లు తనకు దన్నుగా ఉన్న వారిని  గుర్తించినట్లు అవుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

మొన్నటి వరకూ టీడీపీలో ఉండి.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ పరాజయం తర్వాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కావలికి చెందిన పారిశ్రామికవేత్త బీదా మస్తాన్ రావును రాజ్యసభకు పంపేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో నెల్లూరు ఎంపీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేయాల్సి వచ్చింది. అయితే.. ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన బీదాకు తాజాగా రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అని చెబుతున్నారు.

రాజ్యసభకు పంపాల్సిన నలుగురిలో ఇద్దరి సంగతి ఇలా ఉంటే.. మూడో వ్యక్తి ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్న మోపిదేవి వెంకటరమణగా చెబుతారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు.. ఆదాయానికి మించిన ఆస్తుల పేరుతో పెట్టిన కేసుల్లో జగన్ తో పాటు.. మోపిదేవి కూడా జైలుకు వెళ్లారు. శిక్ష అనుభవించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను.. తాజాగా రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన మోపిదేవిని.. ఎమ్మెల్సీని చేయటం ద్వారా మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మండలి మునిగిపోయే నావ కావటంతో రాజ్యసభకు పంపాలని జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

నలుగురిలో ముగ్గురి విషయంలో క్లారిటీతో ఉన్న జగన్.. నాలుగో స్థానాన్ని ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. అయితే.. నాలుగో వ్యక్తి మరెవరో కాదని.. మెగాస్టార్ అని చెప్పినా.. వాస్తవం ఎంత? అన్న విషయంలో మాత్రం పలు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే మరింత సమయం వెయిట్ చేయక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English