ఢిల్లీలో ముఖ్యమంత్రి ఏం చేసినట్లు..?

ఢిల్లీలో ముఖ్యమంత్రి ఏం చేసినట్లు..?

పేరుకు ముఖ్యమంత్రనే కానీ.. కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్కూల్లో పిల్లాడికి క్లాస్ లీడర్ అని ట్యాగ్ తగిలించి.. టీచర్ చేయాల్సిన కొన్ని పనులు ఆ పిల్లాడి చేత చేయిస్తారు గుర్తుందా? అతనేం చేయాలన్న... టీచర్.. టీచర్ ఇప్పుడేం చేయమంటారు అని అడుగుతాడు కదా. అచ్చం మన కిరణ్ బాబుది అదే పని. క్లాస్ లీడర్ ఒక్క టీచర్ చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. కానీ.. ముఖ్యమంత్రి కిరణ్ పరిస్థితి మరింత దారుణం. అయినా ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా. ఏదో ఒకటో రెండో క్లాస్ అయితే ఒక టీచర్ తో సరిపోతుంది. మరి ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు చాలా మంది టీచర్లు ఉంటారు.

గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ ఇలా చాలామందిని సంతృప్తి పర్చాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంటుంది. ఏ టీచర్ కి కోపం వచ్చినా కొంపమునుగుతుంది. హెడ్మాష్టర్ దగ్గర ఇమేజ్ డ్యామేజ్ కావటంతోపాటు.. ఉన్న పదవి పుటుక్కునే ప్రమాదం ఉంది. అంతేనా.. భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే.. ఆయన తాను చేయాల్సిన పనుల లిస్ట్ ఒకటి రెడీ చేసుకొని పది రోజులకో... పదిహేను రోజులకో ఒకసారి ఢిల్లీకి వెళ్లి టీచర్లకు తాను చేసిన.. చేయాల్సిన పనుల గురించి చెబుతుంటారు. వారి సలహాలు తీసుకొని.. వారి అనుమతితో పనులు పూర్తి చేస్తుంటారు.

తాజాగా రెండున్నర రోజుల ఢిల్లీ ట్రిప్పు అందులోని భాగమే. నిజానికి కిరణ్ కు కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఆశ లేదు. కాకపోతే.. సుడి తిరిగి ఏదైనా అద్భుతం జరిగితే తన జట్టును ఫీల్డ్ లోకి దించొచ్చనుకున్నారు. కానీ.. ఆయన ఆశ నెరవేరలేదు. ఒకరి తర్వాత ఒకరిని కలిసినా.. ప్రయత్నం ఫలించలేదు. కాకపోతే.. ఈసారి పర్యటనలో ఒక్క మేలు ఏంటంటే మాంటెంక్ సింగ్ వారి చేత ప్రశంసలు పొందుతూ.. రాష్ట్రం ప్రభుత్వ పనితీరు బాగుందని అనిపించుకోవటం. రాష్ట్రంలో ఎంత తిట్టించుకున్నా.. ఢిల్లీ వీధుల్లో పొగడ్త లభించిందంటే.. దాని ప్రభావం చాలానే ఉంటుంది. ఇలాంటివి బంపర్ ఆఫర్ కింద చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ ముఖ్యనేతలకు ఇలాంటి విషయాలు చేరినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ అంటేనే.. విపరీతంగా వణికిపోతున్న కాంగ్రెస్ పెద్దలకు ఇలాంటి సానుకూల పరిణామం వారిని ఆనందింపజేస్తుంది. మంత్రివర్గ విస్తరణ కోసం ఆయన చాలా ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కలేదు. కాకపోతే.. ఇప్పుడు కాదు కానీ.. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కానివ్వండి. ఆ తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేయటంతో... ఊసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. గంపెడాశలతో ఢిల్లీకి వచ్చిన ఆయన ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు