పార్లమెంటు పెద్దల సభకు ప్రియాంక గాంధీ?... నిజమేనా?

పార్లమెంటు పెద్దల సభకు ప్రియాంక గాంధీ?... నిజమేనా?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించి ఇటీవలి కాలంలో ఏ వార్త వచ్చినా... ఆసక్తి రేకెత్తిస్తోందనే చెప్పాలి. ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా కూడా అందరూ అటుకేసి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన ఓ వార్త కూడా అమితాసక్తి రేకెత్తిస్తోంది.

సోనియా కూతురు, పార్టీలో ఇటీవలే ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ రాజ్యసభకు ఎన్నిక కానన్నారన్నదే ఆ వార్త. ఈ వార్తలో ఏ మేర నిజముందో తెలియదు గానీ... పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్లాప్ అయిన తర్వాత ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్త అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మనవరాలిగా, అచ్చూ ఇందిరమ్మ లానే కనిపించే ప్రియాంక ఎప్పటికైనా పార్టీలో క్రియాశీలక భూమిక పోషిస్తారని, ప్రియాంక రాకతో పార్టీకి పునరుజ్జీవం తప్పదని పార్టీ శ్రేణులు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక ఏదో ఒక పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగుతారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఎందుకనో గానీ... ప్రియాంక సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు.

అయితే ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపించిన ప్రియాంక... పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం మాత్రమే పనిచేశారు.

తాజాగా ప్రియాంకకు సంబంధించిన వార్త విషయానికి వస్తే.. ప్రియాంకను కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దల సభలో మొత్తం 245 స్థానాలు ఉండగా, త్వరలో 68 సీట్లు ఖాళీ అవుతాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు కోల్పోనుంది. అదే సమయంలో మిత్రపక్షాల సాయంతో వాటిలో 10 సీట్లను కాంగ్రెస్ మళ్లీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

తాము అధికారంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కు పెద్దగా అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లోనే ఓ రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపవచ్చని భావిస్తున్నారు. పార్టీ అధినేత్రి కూతురుగా ఉన్న ప్రియాంక ఇలా పరోక్ష ఎన్నిక ద్వారా చట్టసభలోకి అడుగుపెట్టే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English