ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని బయటపెట్టిన వీడియో

ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని బయటపెట్టిన వీడియో

మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించి అమలుకు సిద్ధం అవుతున్న పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం మీద కొన్ని నెలలుగా ఎంత రగడ నడుస్తోందో తెలిసిందే. ఈ చట్టాన్ని కొన్ని రాజకీయ పక్షాలతో పాటు సమాజంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోడీ సర్కారు ఉద్దేశం ఏమైనా కావచ్చు కానీ.. దీనిపై అసలు రెండో అభిప్రాయమే ఉండొద్దని.. ఎవ్వరూ దీన్ని వ్యతిరేకించకూడదని అనడం ఎంతమాత్రం సమంజసం కాదంటోంది మేధావి వర్గం.


ఈ చట్టాన్ని ఢిల్లీలోని జవహర్ లాల్, జామియా ఇస్లామియా యూనివర్శిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వారిని ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కారు. డిసెంబరులో జామియా యూనివర్శిటీలోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి విద్యార్థుల్ని, యూనివర్శిటీ సిబ్బంది విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. పోలీసులు అకారణంగా దాడి ఎందుకు చేస్తారు.. విద్యార్థులు వాళ్లను కవ్వించి ఉంటారు అంటూ ఓ వర్గం వారిని వెనకేసుకొచ్చింది. కానీ జామియా యూనివర్శిటీ విద్యార్థులు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే.. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారో అర్థమవుతుంది. యూనివర్శిటీ లైబ్రరీలో ఎవరి పాటికి వాళ్లు చదువుకుంటూ తమ పనుల్లో మునిగిపోయి ఉంటే.. పోలీసులు హఠాత్తుగా అక్కడికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా వారిపై దాడి చేయడం వీడియోలో కనిపించింది.

పెద్ద పెద్ద కర్రలతో లోనికి వచ్చిన పోలీసులు.. వచ్చీ రాగానే కొట్టడం మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉన్న చోటికి వచ్చి నేరుగా అలా విచక్షణా రహితంగా కొట్టడం చూసి జనాలు విస్తుబోతున్నారు. ఇది ఫేక్ అని చెప్పడానికి వీల్లేని విధంగా ఉంది వీడియో. ఈ వీడియో చూశాక మోడీ సర్కారును తీవ్రంగా దుయ్యబడుతున్నారు జనాలు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English