గ‌జ్వేల్ నుంచే ప‌ని మొద‌లుపెట్టిన పీకే

దేశ‌వ్యాప్తంగా సుప‌రిచితుడు అయిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్కిషోర్ టీంతో టీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విష‌యంలో ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాన‌ప్ప‌టికీ త‌న‌కు అప్పగించిన బాధ్య‌త‌ల ప్ర‌కారం పీకే ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణపై దృష్టి పెట్టినట్లు ఆయన పర్యటనల ద్వారా అర్థం అవుతోంది.

ఇప్పటికే తన టీం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాలపై సర్వేలు చేస్తుండగా తాజాగా స్వయంగా పీకే కూడా రంగంలోకి దిగారు. గ‌జ్వేల్ నుంచే పీకే ప‌ని మొద‌లుపెట్టినట్లు తాజాగా ఆయ‌న రెండ్రోజుల టూర్ తెలియ‌జేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మొద‌లుపెట్టిన ప్ర‌శాంత్ కిశోర్ నేరుగా జనంలోకి వెల్తున్నారు. అయితే, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలిసి సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో పీకే శనివారం పర్యటించారు.  ఇద్దరూ ఉదయం నుంచి  సాయంత్రం పొద్దు పోయే వారకు వరకు గజ్వేల్లోనే పర్యటించారు. గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అలాగే మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పరిశీలించారు. అయితే, తనను ఎవరూ ఏ మాత్రం గుర్తు పట్టకుండా జాగ్రత్త పడ్డారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది..? సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు బాగున్నాయా..? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది..? అనే అంశాలను పలువురిని అడిగినట్లు తెలుస్తోంది. ఇంత వివ‌రంగా అధ్య‌య‌నం చేసిన‌ప్ప‌టికీ, గ‌జ్వేల్‌లో తన పర్యటనను రహస్యంగా ఉంచాలని ఆయన ముందే ప్రకాశ్రాజ్కు చెప్పినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు త‌న జాగ్ర‌త్త తాను తీసుకుంటూ గ‌జ్వేల్‌ పర్యటనలో ప్రశాంత్ కిశోర్ రెండు మాస్క్‌లు ధరించారు. అందుకే తమ పక్కనే ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా పీకేను ఏ మాత్రం గుర్తు పట్టలేకపోయారు. అయితే ఆదివారం ఉదయం ఈ విషయం తెలియడంతో ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.