తమిళనాట తెలుగు పార్టీ... వర్కవుట్ అవుతుందా?

తమిళనాట తెలుగు పార్టీ... వర్కవుట్ అవుతుందా?

ఈ వార్త నిజంగానే ఆసక్తికరమేనని చెప్పాలి. తమిళనాడులో తెలుగు ప్రజలను ఏకం చేయడానికి ఓ తెలుగు పార్టీ ఆవిర్భవించబోతోందట. అది కూడా తమిళనాడు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. పెను వివాదంలో చిక్కుకుని, ఆపై వాటి నుంచి బయటపడి.. అటు తర్వాత పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలుగు నేలకు చెందిన రామ్మోహన్ రావు ఈ పార్టీని స్థాపిస్తున్నారట. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో తెలుగు పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు రామ్మోహన్ రావు సంచలన ప్రకటన చేశారు.

తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తాకిడి తట్టుకోలేకే.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు నేలను విడదీయాలని, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఓ రేంజిలో పోరాటం జరిగింది. తెలుగు ప్రజల తరఫున ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి... ఆ దీక్షలోనే ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగం కారణంగా ఎలాగోలా మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుంచి పాలనాపరంగా తెలుగోళ్లు ఎంత వేరుపడ్డా... వ్యవహారంలో మాత్రం ఇంకా తంబీలతో సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడు పొరుగు జిల్లాలు అక్కడి ప్రజలతో విడదీయరాని బంధాలను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో తమిళనాడులో తెలుగోళ్లు చాలా మందే ఉన్నారు. ఇక ఆలిండియా సర్వీసుకు ఎంపికైన చాలా మంది తెలుగోళ్లు కూడా తమిళనాడులో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాళ్లలో రామ్మోహన్ రావు కూడా ఒకరు. సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన రామ్మోహన్ రావు... తమిళనాడు కేడర్ ను ఎంపిక చేసుకుని ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం చేజిక్కించుకున్నారు.

దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రామ్మోహన్ రావు... జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే నేతల మాదిరే చాలా ఇబ్బందులు పడ్డారు. ఏకంగా ఆదాయపన్ను శాఖ ఆయనపై వరుస దాడులు చేసింది. ఆ తర్వాత సర్వీసు నుంచి రిటైర్ అయిన రామ్మోహన్ రావు అప్పుడెప్పుడో జనసేనలో చేరతారని ప్రచారం సాగింది. అయితే ఎందుకనో గానీ.. జనసేనకు బయటి నుంచి సహకారం అందించిన ఆయన పార్టీలో పెద్దగా కనిపించలేదు.

తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామ్మోహన్ రావు సంచలన ప్రకటన చేశారు. తమిళనాట తెలుగు ప్రజలను ఏకం చేసేందుకు తెలుగు పార్టీని పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారు వారి ప్రకటనల ద్వారా ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని రామ్మోహన్ రావు అంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్‌లతో పాటు హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. 2021 ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వచ్చినా తెలుగు వారు మాత్రం కచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ రావు అంటున్నారు. మరి ఆయన వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English