కర్నూలులో పీకే... జగన్ కు ప్రశ్నల వర్షం

కర్నూలులో పీకే... జగన్ కు ప్రశ్నల వర్షం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను అనుకున్నట్లుగానే రాయలసీమ ముఖద్వారం కర్నూలులో బుధవారం అడుగుపెట్టారు. సుడిగాలి పర్యటన చేశారు. అంతేనా... ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు నుంచే పవన్ ప్రశ్నల పరంపరను సంధించారు. అసలు ఓ అభాగ్యురాలికి న్యాయం చేయలేని మీకు... సీఎంగా ఉండే అర్హత ఉందా? అంటూ పవన్ సంధించిన ప్రశ్నలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఓ గిరిజన బాలికకు జరిగిన అన్యాయం జరిగితే... ఆమెకు న్యాయం జరగని చోట జ్యుడిషియల్ కేపిటల్ ను ఏ ముఖం పెట్టుకుని పెడతారంటూ కూడా పీకే సంధించిన ప్రశ్నలు వైరల్ గా మారాయి.

కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఈ ఘటన జరిగి చాలా రోజులే అయినా కూడా ప్రీతి హంతకులకు శిక్ష పడలేదు. అంతేనా ఏదో అలా కేసైతే బుక్ చేశారు గానీ.. దానిపై దర్యాప్తు సాగిన దాఖలా కూడా లేదు. ఈ ఘటనలో అత్యంత కీలకమైన విషయమేమంటే... ప్రీతిపై అత్యాచారం జరిపింది కళాశాల యాజమాన్యానికి చెందిన వ్యక్తులే. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులుగా చెలామణి అవుతున్న వారు ప్రీతిపై హత్యాచారం చేసి కూడా ఇంకా బయటే తిరుగుతున్నారు. ప్రీతి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లినా ఇప్పటికీ వారి మొర ఆలకించిన వారు లేరనే చెప్పాలి.

ఇలాంటి నేపథ్యంలో ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పవన్ చాలా వేగంగా స్పందించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటుగా ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునేదాకా తాను విశ్రమించబోనని చాలా కాలం క్రితమే పవన్ ప్రకటించారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మరోమారు స్పందించిన పవన్... ప్రీతికి న్యాయం జరగకపోతే... కర్నూలు వేదికగానే తాను ఆమరణ దీక్షకు దిగుతానని కూడా పవన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 12(బుధవారం) కర్నూలు పర్యటనకు వస్తున్నానని కూడా ప్రకటించిన పవన్... అనుకున్నట్లుగానే బుధవారం కర్నూలు పర్యటనకు పవన్ వచ్చేశారు.

ఈ సందర్బంగా పవన్ జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ సంఘటన గురించి మాట్లాడినప్పుడు.. ప్రీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ ప్రశ్నించారు. కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా ప్రకటించారని, అయితే ఇక్కడే న్యాయం చేయకపోతే ఇంకెక్కడ జరుగుతుందని నిలదీశారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోతే కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టినా నిష్ప్రయోజనమని చెప్పారు. ప్రీతి హత్యాచార కేసును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సీబీఐకి అప్పగించకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని హెచ్చరించారు. అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని, ఇలాంటి స్టేషన్లు కర్నూలులో కూడా పెట్టాలన్నారు.

సుగాలి ప్రీతి  ఒక గిరిజన బాలిక అని.. కులాలు, మతాలు ఏవైనా న్యాయం ఒక్కటిగానే ఉండాలని పవన్ అన్నారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం దళిత, గిరిజనులకు మరొక న్యాయం ఉండకూడదని చెప్పారు. ఇలాంటి అసమానతలు చూసే జనసేన పార్టీ పెట్టినట్లు తెలిపారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని అధికారులకు ఉన్నా రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికపై అత్యాచారాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే పిల్లల్ని ఇంకెవరు రక్షిస్తారని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రశ్నించకపోతే రేపు మన ఇంట్లోకి చొరబడి కూడా ఇలాంటి అఘాయిత్యాలు చేస్తారని హెచ్చరించారు. సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని పవన్ తేల్చి చెప్పారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English