ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు

ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్నది దాదాపు క్లియర్ అయింది. కొత్త రాష్ట్రం ఏర్పాటు అపాయింటెడ్ తేది జూన్ రెండున ఉంటుందని కేంద్ర రాజపత్రం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ కూడా దానికి సంబందించిన కసరత్తు, ఆవిర్భావ తేది ఖరారు చేసింది అన్న వార్తలు వెలుబడ్డాయి. అందుకు ఈ సారికి అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటాయంటున్నారు. కారణం అపాయింటేడ్ తేది మే 2 లోపు ఉంటే కనుక సాంకేతికంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి ఇబ్బందులు ఉంటాయని, ఆతర్వాత ఎప్పుడు అపాయింటేడ్ తేది ఉన్నా కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుపుతామని ఇది వరకే ఎన్నికల కమీషన్ ప్రకటించింది. దీంతో ఇప్పుడున్న సమాచారం మేరకు ఇక హోల్ ఏపిలోనే అసెంబ్లీ ఎన్నికలుంటాయని భావించవచ్చు.

దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఉద్యోగుల పంపిణీ, ఆదాయం,ఆస్తలు, ఇతరత్రా పంపిణీకి సమయం పడుతున్నందునే అపాయింటెడ్ తేది జూన్ 2గా నిర్ణయించారంటున్నారు. అయితే దీని వెనుక మరో లోగుట్టు ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదేంటంటే తెలంగాణ ఇచ్చిన ఘనత సాదించిన సోనియాగాందీ పుట్టిన దేశం ఇటలీకి అదే రోజు గణతంత్ర దినోత్సవం కావడం. అయితే ఇది యాదృచ్చికంగా కలిసి వచ్చిందా, లేక అందులో ఆమె సెంటిమెంట్ దాగుందా అన్న విషయం పక్కన బెడితే సోనియా ఇచ్చిన ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావ దినోత్సవం ఇక ముందునుంచి ఇటలీ గణతంత్ర దినోత్సవం రోజు జరుపుకోనున్నామన్నది మాత్రం వాస్తవం.

ఇది మన రాజకీయాలపై, మన అస్థిత్వంపై ప్రభావం చూపెట్టే అంశం కాదు కాబట్టి దానిని కాస్తా పక్కన బెడితే జూన్ రెండున అపాయింటేడ్ తేది నిర్ణయించడం ద్వారా కాంగ్రెస్ కు ఏదైనా లబ్ది జరుగుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. జూన్ రెండున అపాయింటేడ్ తేది పెట్టడం ద్వారా ఇప్పుడు అసెంబ్లీకి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడు ఏపికి మొత్తం ఒకటే ఉంటుంది. జూన్ రెండు తర్వాత ఇదే బలాబలాల ఆధారంగా రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

దీని వల్ల కాంగ్రెస్ కు లాభమెంత అని ఆలోచిస్తే అది ఎంత మాత్రం కాంగ్రెస్ కు లాభించదు అన్న అభిప్రాయాలే మెజారిటి వర్గాల్లో వినిపిస్తున్నాయి. కారణం టిఆర్ఎస్ అటు తెలంగాణలో హ్యాండిచ్చింది. అంతే కాదు తెలంగాణ సెగ ఇంకా తగ్గలేదు, సాధించిన ఘనత టిఆర్ఎస్ కే ఎక్కువగా ఉంది. అంతే కాదు తెలంగాణ కాంగ్రెస్ లో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పార్టీకి నాయకత్వం వహించే స్థాయి నాయకుని కొరత కూడా ఉంది. అంటే సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఎన్నికలు పెడితే అక్కడ టిఆర్ఎస్ కే లాభం అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

అంతే కాదు సీమాంద్రలో నయితే పార్టీలో నాయకులే లేకుండా పోయారు. అక్కడ తన పెంపుడు కొడుకుగా భావిస్తున్న జగన్ బలం ఎక్కువ ఉన్నట్లు తాజాగా ఈ రోజు ప్రచురించిన సిఎన్ఎన్ సర్వే కూడా తేల్చి చెప్పింది. సీమాంద్రకు సీమాంద్ర మంత్రులుండి కూడా చేయలేని పనులు చేసామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి ఇప్పుడు ఇచ్చిన హామీలు,ప్యాకేజీలు అమలు కావాలంటే తమకే పట్టం కట్టాలని బిజేపి చేస్తున్న ప్రచారానికి సీమాంద్రలో స్పందన కూడా కనిపిస్తోంది. అంతే కాదు తమ వెంట ఉంటాడని భావించిన జగన్ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతోనే పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విడగొట్టింది అన్న ఆగ్రహసెగలు సీమాంద్రలో చల్లారలేదు. ఈ దశలో అసెంబ్లీ ఎన్నికల వల్ల కాంగ్రెస్ కు సీమాంద్రలోను నష్టమే.

ఇంత తెలిసి ఇప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వీలును కాంగ్రెస్ ఎందుకు కల్పించింది, కాదుకాదు ఎందుకు కల్పిస్తుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏపిలో వాయిదా పడేసేందుకు ఇంకా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా దీంతో వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్టునాశ్రయించారు. ఇది ఏమైనా ఆటంకంగా మారుతుందా, లేక భద్రాచలం డివిజన్ లోని ముంపు మండలాలను సీమాంద్రలో కలపడంపై టిఆర్ఎస్ కోర్టుకు వెలుతోంది ఇది కూడా ఏమైన అడ్డంకి అవుతుందా అన్నది అందరిని ఆలోచింప చేస్తోంది.

అయితే ఈ రెండు కూడా విభజన విషయంలో ఆటంకాలు కలిగించేవే కాబట్టి అది ఏమైనా ఆగిపోయే అవకాశాలను కల్పిస్తుందేమో అంటున్నారు. అలాంటప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగడానినే ఇవి కూడా దోహదం చేయవచ్చంటున్నారు. అయితే రాజ్యాంగాన్ని వడపోసే నేతలున్న కాంగ్రెస్ వ్యూహాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయోద్దని, ఇందులో కాంగ్రెస్ తన ప్రయోజనాలను చూసుకునే ఉంటుందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదేంటనేది ముందుముందుగాని తెలిసిరాదు. అందుకే ఎన్నికల నిర్వహణ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English