అసెంబ్లీకి వెళ్లాలా? వ‌ద్దా?

Chandrababu

తెలుగు దేశం పార్టీ ఇప్పుడో గొప్ప సందిగ్ధంలో ప‌డిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వెళ్లాలా? వ‌ద్దా? అని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆ అసెంబ్లీ స‌మావేశాల స‌మాచారం వ‌చ్చిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు లేకుండా స‌భ‌కు వెళ్ల‌డంపై టీడీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మావేశాల‌కు వెళ్ల‌డంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి పార్టీ రాలేద‌ని తెలిసింది.

బాబు శ‌ప‌థం..
నిరుడు అసెంబ్లీ నిండు స‌భ‌లో త‌న భార్య భువ‌నేశ్వ‌రిపై వైసీపీ నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ రాష్ట్ర అత్యున్న‌త చ‌ట్ట స‌భ స‌మావేశాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత బాబు బ‌హిష్క‌రించారు. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే స‌భ‌లో అడుగుపెడ‌తానని శ‌ప‌థం చేసిన ఆయ‌న‌.. బ‌య‌ట‌కు వ‌చ్చి విలేక‌ర్ల స‌మావేశంలో క‌న్నీళ్లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల‌కు బాబు హాజ‌ర‌య్యే అవ‌కాశం లేదు. మ‌రి ఆ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు వెళ్లాలా? అనే విషయంపై చ‌ర్చ సాగుతోంది.

వెళ్లి నిల‌దీయాల‌ని..
గ‌తంలో బాబు ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాల్లో మాట్లాడేందుకు నిరాక‌రించ‌డానికి నిర‌స‌న‌గా మొత్తం వైసీపీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. కానీ ఇప్పుడు బాబు మాత్ర‌మే శ‌ప‌థం చేసి బ‌య‌ట‌కు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో మిగిలిని టీడీపీ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు హాజరు కావాల‌నే అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటే స‌భకు వెళ్లాల్సిందేన‌ని మెజారిటీ స‌భ్యులు చెప్పిన‌ట్లు స‌మాచారం.

కానీ స‌మావేశాల‌కు వెళ్లినా మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని, అలాంట‌ప్పుడు వెళ్ల‌డం ఎందుక‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డార‌ని టాక్‌. ఈ నేప‌థ్యంలో టీడీపీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశంలో తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని బాబు చెప్పిన‌ట్లు తెలిసింది. అయితే చివ‌ర‌కు స‌మావేశాల‌కు వెళ్లేందుకే టీడీపీ మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప‌రిస్థితులను బ‌ట్టి బ‌హిష్క‌రించ‌డ‌మో లేదా అక్క‌డే నిర‌స‌న తెలియ‌జేసేలా పార్టీ నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది.